ప్రజల సంక్షేమమే కాంగ్రెస్ పరమావధి
* తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి జితేందర్‌రెడ్డి
హైదరాబాద్, డిసెంబర్ 8 (విజయక్రాంతి): ప్రజల సంక్షేమమే పరమావధిగా కాంగ్రెస్ ప్రభుత్వం పునరంకితమవుతోందని ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి ఏపీ జితేందర్ రెడ్డి అన్నారు. ఆదివారం ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో ‘ప్రజా పాలన విజయోత్సవాల వేడుకలు’ ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి జితేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. నియంతృత్వ పాలన నుంచి తెలంగాణకు స్వేచ్ఛావాయువులు అందించిన కాంగ్రెస్, అదే ఉద్యమ స్ఫూర్తితో రాష్ట్రాన్ని ఒక శక్తిగా తీర్చిదిద్దే దిశగా అడుగులు వేస్తోందన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి సూచనలతో ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో విజయోత్సవాలను నిర్వహించినట్లు చెప్పారు. వేడుకల్లో తెలంగాణ భవన్ అధికారులు, సిబ్బంది, వారి కుటుంబ సభ్యులు, ఢిల్లీలోని తెలుగు ప్రజలు పాల్గొన్నారు.






