07-08-2025 01:12:14 AM
న్యూఢిల్లీ, ఆగస్టు 6: ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న పలు యుద్ధాల గురించి ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఆందోళన వ్యక్తం చేశారు. మహారాష్ట్రలో జరిగిన ఒక కార్యక్రమానికి హాజరైన ఆయన మాట్లాడారు. ప్రస్తుతం సంఘర్షణలతో నిండిన ప్రపంచానికి హిందూయిజం అవసరం చాలా ఉందని అభిప్రాయప డ్డారు. ఎందుకంటే అన్ని రకాల వైవిధ్యాలను ఎలా అంగీకరించాలి? ఎలా పాటించాలనే విషయాన్ని హిందూయిజం మాత్రమే ప్రపంచ దేశాలకు నేర్పుతుందన్నారు.
సంఘర్షణలను ఎలా నియంత్రించాలో ప్రపంచ దేశాలకు తెలియకపోవడం వల్ల రోజురోజుకు ఘర్షణలు తీవ్ర రూపం దాలుస్తున్నాయని భగవత్ పేర్కొన్నారు. ధర్మాన్ని బోధించే హిందూయిజాన్ని పాటించడం మాత్రమే అన్ని సమస్యలకు పరిష్కారమని పేర్కొన్నారు. భిన్నత్వంలో ఏకత్వా న్ని పాటించగలిగే జీవన విధాన్ని హిందూ సంస్కృతీ సంప్రదాయాలు అలవాటు చేస్తామని భగవత్ వెల్లడించారు.
ఈ మతం ప్రజలు దేవుడికి ఎలా సేవ చేస్తారో, సమాజానికి అదే విధంగా సేవ చేయాలని బోధిస్తుందని తెలిపారు. భారత ప్రజలు నమ్మే ధర్మం కోసం పూర్వీకులు అనేక త్యాగాలు చేసినట్టు దేశ చరిత్ర ప్రపంచానికి తెలియజేస్తోందని.. ప్రాణాలు పోతున్నా శివాజీ లాంటి మహాత్ములు ధర్మాన్ని తప్పలేదని గుర్తు చేశారు.