31-07-2025 12:51:11 AM
మహబూబాబాద్, జూలై 30 (విజయ క్రాంతి): భారతీయ రైల్వే చరిత్రలో అత్యంత దుర్ఘటనల్లో ఒకటిగా నిలిచిన గౌతమి ఎక్స్ ప్రెస్ రైలు అగ్ని ప్రమాద ఘటన జరిగి నేటికి 18 ఏళ్లు గడిచిపోయాయి. సికింద్రాబాద్ నుంచి కాకినాడకు వెళుతున్న గౌతమి ఎక్స్ ప్రెస్ రైలు 2008 జూలై 31న అర్ధరాత్రి 1:10 గంటల సమయంలో కేసముద్రం తాళ్లపూస పల్లి రైల్వే స్టేషన్ల మధ్య అగ్ని ప్రమాదం సంభవించి నాలుగు బోగీలు దగ్ధమయ్యాయి.
ఈ దుర్ఘటనలో 32 మంది మరణించారు. ఎలక్ట్రిక్ షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగిందని అప్పట్లో ప్రకటించినప్పటికీ, స్పష్టమైన కారణాలను వెల్లడించలేదు. కేసముద్రం రైల్వే స్టేషన్ దాటిన తర్వాత కొద్దిసేపటికే ఎస్ 9 భోగిలో మంటలు చెలరేగి రైలు వేగంగా వెళుతుండడంతో ఎస్ 13 భోగి వరకు వ్యాప్తించాయి. కొందరు ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించి చైను లాగి రైలు నిలిపిన తర్వాత మంటలు ఇతర బోగిలకు వ్యాప్తించకుండా రైల్వే సిబ్బంది బోగిలను వేరు చేశారు.
అప్పటికే ఆయా బోగీల్లో ప్రయాణిస్తున్న 32 మంది ప్రయాణికులు దుర్మరణం పాలు కాగా మరో 20 మందికి పైగా గాయపడ్డారు. గాఢ నిద్రలో ఉండడం వల్ల చాలామంది ప్రయాణికులు ప్రాణాలను రక్షించుకోలేని పరిస్థితి ఎదురయ్యింది. ఈ దుర్ఘటన స్థలాన్ని అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి, రైల్వే శాఖ సహాయ మంత్రి నారాయణ భాయ్ రాత్వ స్వయంగా వచ్చి పరిశీలించి సహాయ చర్యలను పర్యవేక్షించారు.
గౌతమి రైలు దుర్ఘటనలో మరణించిన వారిలో ఐదుగురు మినహా మిగిలిన వారి దేహాలు పూర్తిగా కాలిపోయి గుర్తుపట్టలేని విధంగా మారిపోయాయి. దీనితో ఈ రైల్లో ప్రయాణిస్తున్న తమ వారు కనిపించడం లేదని మృతుల బంధువులు వారి జడ కోసం చాలా రోజుల వరకు గాలించారు.
కాగా 2010లో మానవ హక్కుల కమిషన్ సూచనల మేరకు ప్రయాణిస్తున్నట్లు గుర్తించిన వారిలో ఆచూకీ లేకుండా పోయినవారికి కేసముద్రం తహసిల్దార్ కార్యాలయం నుంచి మరణ ధ్రువీకరణ పత్రాలు జారీ చేశారు. జూలై 31 వచ్చిందంటే చాలు నాటి దుర్ఘటన మళ్లీ ఇక్కడి ప్రజల మదిలో కదలాడుతూ మానని గాయంగా గౌతమి దుర్ఘటన నిలుస్తోంది.