01-08-2025 05:33:20 PM
హైదరాబాద్: నల్గొండ జిల్లా దామరచర్ల మండలంలోని యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ (Yadadri Thermal Power Station) వద్ద 800 మెగావాట్ల సామర్థ్యం కలిగిన యూనిట్‌ను జాతికి అంకితమివ్వడం జరిగింది. ఈ యూనిట్‌ను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క(Deputy Chief Minister Bhatti Vikramarka), ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ ప్రారంభించారు. ఈ యూనిట్‌తో పాటు ఉద్యోగుల, ఇంజినీర్ల వసతుల కోసం ప్రత్యేకంగా రూపకల్పన చేసిన ఇంటిగ్రేటెడ్ టౌన్‌షిప్ నిర్మాణానికి పైలాన్ వద్ద శంకుస్థాపన చేయడం జరిగింది. తెలంగాణ అభివృద్ధికి ఇంధనం అందించే ఈ ప్రాజెక్టు రాష్ట్ర పరిశ్రమల విస్తరణకు బలమైన పునాది అవుతుంది.
వైటీపీఎస్ పూర్తిస్థాయిలో ప్రారంభమైతే 4,000 మెగావాట్ల విద్యుత్ అవసరాలను తీర్చగల సామర్థ్యం ఉంది. ఇప్పటివరకు 1,600 మెగావాట్ల సామర్థ్యాన్ని జాతికి అంకితం చేయడం జరిగింది. గత ప్రభుత్వ కాలంలో నిర్లక్ష్యం వల్ల ప్రాజెక్టు పనుల్లో రెండేళ్ల జాప్యం జరిగింది. ప్రస్తుత ప్రజా ప్రభుత్వం ఈ ప్రాజెక్టును వేగవంతంగా పూర్తిచేస్తోంది. పవర్ ప్లాంట్ పరిసర గ్రామాల ప్రజలకు ఉచితంగా విద్యా, వైద్య సదుపాయాలు కల్పించనున్నారు. అలాగే, భూ నిర్వాసితులైన యాదాద్రి, పులిచింతల ప్రాంతాల ప్రజలకు వచ్చే ఆగస్టు 15లోగా ఉద్యోగాలు, పునరావాస, పునరన్వయ (R&R) ప్యాకేజీ అందించనున్నారు.