04-09-2025 12:22:33 AM
-దుకాణం వద్దే రోడ్డుపై రైతులు ధర్నా
-ధర్నాకు మద్దతు తెలిపిన బీజేపీ
నల్లగొండ టౌన్ సెప్టెంబర్ 3 (విజయ క్రాంతి) : యూరియా కొరతతో నల్లగొండ రైతులు ఇబ్బందులు పడుతూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలోని దేవరకొండ రోడ్డు వెంకటేశ్వర ఆగ్రో ఏజెన్సీ వద్ద బుధవారం తెల్లవారుజాము నుంచే ఎరువుల కోసం అన్నదాతలు గంటలకు తరబడి క్యూలో నిలుచున్నారు. వర్షాల సీజన్లో తక్షణమే యూరియా అందకపోతే పంటలు ఎండిపోతాయని రైతుల ఆందోళన వ్యక్తం చేశారు. వాతావరణ పరిస్థితులకు తగ్గట్టుగా సరఫరా లేని ప్రభుత్వంపై రైతుల తీవ్ర విమర్శలు గుప్పించారు.
ఎరువుల కొరతను వెంటనే తగ్గించి రైతులను కాపాడాలని ప్రభుత్వాన్ని వేడుకున్నారు. పంటల దశలోనే యూరియా లభ్యం కాకపోతే భారీ నష్టాలు తప్పవని ప్రభుత్వానికి రైతు హెచ్చరికలు జారీ చేశారు.ఎరువులు అందక పంటలు ఎండిపోతాయని ఆవేదన వ్యక్తం చేస్తూ రైతులు అక్కడే రోడ్డుపై ధర్నా నిర్వహించారు. రైతుల ధర్నాకు బిజెపి మద్దతు తెలిపింది. వాహనాల రాకపోకలు పూర్తిగా స్థంభించిపోవడంతో ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాను.
ఈ సందర్భంగా బిజెపి రాష్ట్ర నాయకులు పిల్లి రామరాజు యాదవ్ మాట్లాడుతూ రైతులు పంటల యూరియా కోసం క్యూలలో నిలబడాలా అని పేర్కొన్నారు. పంట సీజన్లోనూ ఎరువులు అందించలేని ప్రభుత్వం రైతుల పక్షాన ఉందా అని ప్రశ్నించారు. సమయానికి ఎరువులు అందక పంటలు ఎండిపోతే ఆ నష్టాన్ని ఎవరు భరించాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే యూరియా సరఫరా పెంచాలని కొరత సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు పోతే పాక సాంబయ్య, వివిధ గ్రామాల రైతులు పాల్గొన్నారు.
తుంగతుర్తి..
తుంగతుర్తి సెప్టెంబర్ 3: తుంగతుర్తి మండలం లోని రైతులు యూరియా పంపిణీ చేయాలని కోరుతూ బుధవారం మండల కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ గడిచిన 10 రోజుల నుండి ఉదయం నాలుగు గంటలకే లేచి, చెప్పులు పెట్టి, సాయంత్రం వరకు వేచి చూసినప్పటికీ, నేటి వరకు కూడా యూరియా దొరకలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు రైతులు రెండు గంటల ధర్నాతో ఎక్కడి వాహనాలు అక్కడ నిలిచి, వానదారులకు ఇబ్బందులు గురయ్యాయి.
ఇంతలోనే జరిగిన సంఘటన తెలుసుకున్న స్థానిక వ్యవసాయ సంచాలకులు రమేష్ బాబు ధర్నా ప్రదేశానికి వచ్చి, రైతులను మెప్పించి ,తిరిగి సహకార సొసైటీ కేంద్రానికి పంపించారు. బుధవారం సాయంత్రం వరకు సొసైటీకి యూరియా రానున్నట్లు తెలిపారు. యూరియా దొరకకపోవడంతో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, పలువురు రైతులు దుయ్యబడ్డారు. ఈ కార్యక్రమంలో మండల రైతులు పాల్గొన్నారు
మఠంపలి..
మఠంపల్లి సెప్టెంబర్ 03: యూరియా కోసం మఠంపల్లి మండల కేంద్రంలో బుధవారం అన్నదాతలు ఆందోళనకు దిగారు. యూరియా బస్తాల కోసం సహకార సంఘం సొసైటీ దగ్గర వారం రోజులుగా రైతులు ఎదురు చూస్తున్నారు.అయినప్పటికీ యూరియా రాకపోవడంతో బుధవారం మఠంపల్లి నుండి హుజూర్ నగర్ పోయే ప్రధాన రహదారిపై రైతులు ధర్నా నిర్వహించారు.రైతులకు మద్దతుగా సిపిఐ సిపిఎం పార్టీ మండల కార్యదర్శి, జిల్లా కార్యవర్గ సభ్యులు ధర్నాకు మద్దతుగా నిలిచారు.
ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ వివిధ గ్రామాల నుంచి వచ్చిన రైతులు యూరి యా రాకపోవడంతో రాస్తారోకో ధర్నా నిర్వహించామని వెంటనే యూరియా పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు.రైతులు తమ యొక్క పనులు వదిలి పెట్టుకొని రోజుల తరబడి యూరియా కోసం ఎదురుచూస్తున్నామని తెలిపారు. ఇప్పటికే వరిపంటకు వేయవలసిన యూరి యా వేయకపోవడం వల్ల వరిపొలాలకు భారీగా నష్టం వచ్చే అవకాశాలు ఉన్నాయని అన్నారు.
కేంద్రం నిర్వాహకులు తమను పట్టించుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఒకరిపై ఒకరు నెపం పెడుతూ తమకు యూరియాను ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా ఆందోళన కారణం గా రాకపోకల అంతరాయం ఏర్పడి ట్రాఫిక్ జామ్ అయింది.పోలీసులు రైతులకు నచ్చజెప్పడంతో పాటు యూరియా బస్తాలు అందరికీ అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు. రైతులకు మద్దతుగా ప్రజా సంఘాల నేతలు మద్దతుగా నిలిచారు.