28 August, 2026 | 1:32 AM

యువత అన్ని రంగాల్లో రాణించాలి

28-08-2026 12:25 AM

డాక్టర్ ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్

కొండాపూర్, ఆగస్టు 27: యువత కేవలం ప్రభుత్వ ఉద్యోగాలపైనే ఆధారపడకుండా, అన్ని రంగాల్లో అవకాశాలను అందిపుచ్చుకొని ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చెందాలని తెలంగాణ రాష్ట్ర మాజీ అడిషనల్ డీజీపీ, బీఆర్‌ఎస్ నేత డాక్టర్ ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు.

కొండాపూర్ మండల కేంద్రంలో శ్యామ్ అగ్రికల్చర్ ల్యాండ్స్ మరియు ప్రాపర్టీస్ డాక్యుమెంట్ రైటర్స్ కార్యాలయాన్ని డాక్టర్ ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి పోటీ ప్రపంచంలో యువత తమలోని ప్రతిభను గుర్తించి వివిధ రంగాల్లో రాణించేందుకు కృషి చేయాలని సూచించారు.

ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడం గొప్ప విషయమే అయినప్పటికీ, ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ ఉద్యోగం లభించడం సాధ్యం కాదని, అందువల్ల యువత వ్యాపారం, వ్యవసాయం, రియల్ ఎస్టేట్, సాంకేతిక రంగాలు, స్వయం ఉపాధి తదితర రంగాల్లో అవకాశాలను అన్వేషించాలని అన్నారు.

కొత్తగా ప్రారంభమైన డాక్యుమెంట్ రైటర్స్ కార్యాలయం ప్రజలకు భూములు, ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంటేషన్ సేవలను అందించడంలో నమ్మకంగా పనిచేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బిఆర్‌ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు  విట్టల్, సర్పంచ్ల ఫోరం మాజీ అధ్యక్షులు రుక్ముద్దీన్,మల్ల గౌడ్,సత్యానందం, రామగౌడ్, నర్సింలు, అనిల్, మైపాల్, ప్రేమానందం, వైస్ ఎంపీపీ లక్మి రామచందర్, మాజీ ఎంపిటిసి శ్యామ్ రావు, పార్టీ ప్రధాన కార్యదర్శి గోవర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.