20-01-2026 12:15:53 AM
కార్మికుల సమస్యల పరిష్కారానికి దశలవారీ ఆందోళనలకు సిద్ధం
ఇల్లందు టౌన్, జనవరి 19, (విజయక్రాంతి) : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాల కారణంగా ప్రభుత్వ రంగ సంస్థలు నిర్వీర్యం అవుతున్నాయని, తెలంగాణకు తలమానికమైన సింగరేణి కాలరీస్ మనుగడ ప్రశ్నార్థకంగా మారుతోందని ఏఐటీయుసీ అనుబంధ సింగరేణి వర్కర్స్ యూనియన్ జనరల్ సెక్రటరీ కొరిమి రాజకుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. సోమవారం ఇల్లందులోని ఏఐటీయుసీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, పాలకుల నిర్లక్ష్యం, అధికారుల అలసత్వం వల్ల నూతన భూగర్భ గనులు, ఓసీలకు అనుమతులు ఆలస్యమవుతున్నాయని తెలిపారు.
డిమాండ్కు తగినంత బొగ్గు ఉత్పత్తి జరగక పోవడం, నాణ్యతధరల మధ్య వ్యత్యాసాలను సరిగా గుర్తించడంలో అధికారులు విఫలమవడం వల్ల వినియోగదారులు ఇతర ప్రాంతాల నుంచి బొగ్గు కొనుగోలు చేస్తున్న పరిస్థితి ఏర్పడిందన్నారు. ఎన్నికల సమయంలో మంత్రులు, ప్రజాప్రతినిధులు ఇచ్చిన హామీలు ఇప్పటికీ అమలు కాలేదని విమర్శించారు. ప్రస్తుత మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా బొగ్గు ధరలను నిర్ణయించి సింగరేణి సంస్థ మనుగడకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
బొగ్గు గనులకు పుట్టినిల్లు అయిన ఇల్లందు భవిష్యత్తును కాపాడుకునేందుకు దశలవారీ ఆందోళన కార్యక్రమాలు చేపడతామని స్పష్టం చేశారు. సింగరేణిని కాపాడుకోవడం, కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా పోరాటానికి సిద్ధంగా ఉన్నట్లు ఆయన తెలిపారు. ఈ సమావేశంలో డిప్యూటీ జనరల్ సెక్రటరీ కే. సారయ్య, జిల్లా కార్యవర్గ సభ్యులు దేవరకొండ శంకర్, బ్రాంచ్ కార్యదర్శి నజీర్ అహ్మద్, ఉపాధ్యక్షులు దాసరి రాజారాం, మండల కార్యదర్శి బొప్పిశెట్టి సత్యనారాయణ, బ్రాంచ్ సహాయ కార్యదర్శి గడదాసు నాగేశ్వరరావు, ఆర్గనైజింగ్ కార్యదర్శులు కొరిమి సుందర్, బానోత్ బాలాజీ, గిరిజన సమాఖ్య జిల్లా ఉపాధ్యక్షులు గుగులోత్ కృష్ణ, పిట్ కార్యదర్శి దాట్ల వెంకటేశ్వర్లు, దాట్ల శ్రీకాంత్, శ్రీనివాస్ పాల్గొన్నారు.