calender_icon.png 24 August, 2025 | 2:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మూసీపై వెనక్కి తగ్గేదేలే

24-08-2025 12:02:26 AM

- ప్రక్షాళన చేసి తీరుతాం

- ఎవరు అడ్డుపడినా భావితరాల కోసం వెనుకాడం

- ఆర్థిక భవిష్యత్తుకు పట్టణ ప్రణాళికే పునాది

- పర్యావరణ పరిరక్షణతో కూడిన వృద్ధే లక్ష్యం

- ఐటీపీఐ సౌత్ జోన్ సదస్సులో స్పష్టం చేసిన ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు

హైదరాబాద్ సిటీ బ్యూరో, ఆగస్టు 23 (విజయక్రాంతి): మూసీ నది ప్రక్షాళన విషయంలో ఎంతమంది అడ్డుపడినా వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని, భావితరాల భవిష్యత్తు కోసం శుద్ధి చేసి తీరుతాం అని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు స్పష్టం చేశారు. నీటి వనరుల పరిరక్షణలో తెలంగాణను దేశానికే రోల్ మోడల్‌గా నిలుపుతామని ఉద్ఘాటించారు.

శనివారం బంజారాహిల్స్‌లోని ఓ హోటల్‌లో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టౌన్ ప్లానర్స్ ఇండియా (ఐటీపీఐ) తెలంగాణ రీజినల్ చాప్టర్ ఆధ్వర్యంలో జరిగిన సౌత్ జోన్ సదస్సును ప్రారంభించి, మాట్లాడారు. కొందరు మూసీ ప్రక్షాళనకు అడ్డుపడుతున్నారని, భావితరాల కోసం ప్రక్షాళన చేసి తీరుతామని, ఈ విషయంలో వెనక్కి తగ్గేదే లేదు అని అన్నారు.

‘పాలసీస్ అండ్ స్ట్రాటజీస్ టువార్డ్స్ బయోఫిలిక్ అర్బనిజం’ అనే అంశంపై మంత్రి మాట్లాడుతూ.. కేవలం భవనాలను నిర్మించడమే అభివృద్ధి కాదని, పర్యావరణ పరిరక్షణతో కూడిన సుస్థిర వృద్ధే నేటి ఆవశ్యకమని నొక్కి చెప్పారు. ఆర్థిక భవిష్యత్తుకు సరైన పట్టణ ప్రణాళికే పునాది అని ఆయన అన్నారు. పట్టణాల్లో పచ్చదనం పెంచడం, కార్బన్ రహిత అభివృద్ధి, జల సంరక్షణ, సుస్థిర రవాణా వంటి అంశాలలో తెలంగాణ అవలంబిస్తున్న విధానాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని ప్రశంసించారు.