24-08-2025 12:00:00 AM
డీజీపీ జితేందర్
సైబర్ భద్రత పరిశోధనపై ఐఎస్‌బీతో తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఒప్పందం
హైదరాబాద్ సిటీ బ్యూరో, ఆగస్టు 23 (విజయ క్రాంతి): రాష్ట్రంలో సైబర్ నేరాలను, ఆర్థిక మోసాలను అడ్డుకునేందుకు, నేరగాళ్ల ఆటకట్టించేందుకు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో మరింత పటిష్ట చర్యలు చేపట్టింది. అందులో భాగంగా ప్రఖ్యాత ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ఐఎస్‌బీ హైదరాబాద్‌లోని డేటా సైన్స్ ఇనిస్టిట్యూట్ తో సైబర్ సెక్యూరిటీ బ్యూరో చేతులు కలిపింది.
సైబర్ భద్రతకు సంబంధించిన పరి శోధన, విధానాల రూపకల్పన, సాంకేతిక సాధనాల అభివృద్ధిలో పరస్పరం సహకరించుకునేందుకు ఈ రెండు సంస్థల మధ్య శనివారం కీలక అవగాహన ఒప్పందం ఎం ఓయూ కుదిరింది. ఈ సందర్భంగా డీజీపీ డాక్టర్ జితేందర్ మాట్లాడుతూ సైబర్ నేరా లు ఆధునిక పోలీసింగ్‌లో అతిపెద్ద సవాలుగా మారాయన్నారు. ఐఎస్‌బీ డేటా సైన్స్ నైపుణ్యాన్ని, టీజీసీఎస్‌బీ క్షేత్రస్థాయి అనుభవాన్ని జోడించి, సైబర్ నేరాలను సమర్థవం తంగా నివారించడమే మా లక్ష్యమన్నారు.
ఈ ఒప్పందం పౌరులను రక్షించి, డిజిటల్ తెలంగాణను నిర్మించాలన్న మా సంకల్పానికి ప్రతీక,అని అన్నారు. టీజీసీఎస్‌బీ డైరెక్టర్ శిఖా గోయల్ మాట్లాడుతూ తెలంగాణను ‘మోడల్ సైబర్ క్రైమ్ మేనేజ్‌మెంట్’ రాష్ర్టం గా నిలపడంతో పాటు, దేశవ్యాప్తంగా ఉపయోగపడే పరిష్కారాలు రూపొందించడం లో ఈ ఒప్పందం కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు.
ఈ ఒప్పందంపై తెలంగాణ పోలీసుల తరఫున డైరెక్టర్ శిఖా గోయల్, ఐఎస్‌బీ తరఫున ప్రొఫెసర్ మనీష్ గంగ్వార్ సంతకాలు చేశారు. కార్యక్రమంలో టీజీసీఎస్‌బీ అధికారులు హర్షవర్ధన్ ఐపీఎస్, డీఎస్పీలు హరి కృష్ణ, సూర్యప్రకాశ్, వాసు, సంపత్ , ఐఎస్‌బీ ప్రతినిధులు పాల్గొన్నారు.