calender_icon.png 25 October, 2025 | 12:20 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నగర రూపురేఖల్లో స్పష్టమైన మార్పు కనిపించాలి

25-10-2025 12:41:40 AM

కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి

నిజామాబాద్, అక్టోబర్ 24 (విజయ క్రాంతి):  నిజామాబాద్ నగర రూపురేఖల్లో స్పష్టమైన మార్పు కనిపించేలా నగర పాలక సంస్థ పనితీరు  మెరుగుపడాలని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. మున్సిపల్ కార్పొరేషన్ కాన్ఫరెన్స్ హాల్ లో నగర పాలక సంస్థ పనితీరుపై కలెక్టర్ శుక్రవారం సమీక్ష జరిపారు. పచ్చదనం పెంపొందించడం, పారిశుధ్య నిర్వహణ, బల్దియా ఆస్తుల పరిరక్షణ, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల ప్రగతి తదితర అంశాలపై కూలంకషంగా చర్చించి, ఆయా విభాగాల అధికారులకు కలెక్టర్ దిశా నిర్దేశం చేశారు.

ఒక్కో డివిజన్ వారీగా పై అంశాలలో సాధించిన ప్రగతి, నెలకొని ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడంలో వార్డు అధికారులు బాధ్యతాయుతంగా పని చేయాలన్నారు. పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని అన్నారు.  మున్సిపల్ ఖాళీ స్థలాలు, ఆస్తులను పరిరక్షించేందుకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. ఎక్కడైనా కార్పొరేషన్ స్థలాలు కబ్జాకు గురైతే వాటిని స్వాధీనం చేసుకోవాలని అన్నారు. ఆస్తి పన్ను వసూళ్లు శత శాతం జరగాలని, వాణిజ్య వర్గాల నుండి రావాల్సిన బకాయిలపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని కలెక్టర్ సూచించారు.  ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగంగా జరిగేలా చొరవ చూపాలని అన్నారు.

పట్టణ ప్రాంతాల్లో 400 చదరపు అడుగుల కంటే తక్కువ స్థలం ఉన్న వారు కూడా జీ+1 పద్ధతిలో ఇందిరమ్మ పథకం కింద ఇల్లు నిర్మించుకునేందుకు ప్రభుత్వం అనుమతించిందని తెలిపారు. ఈ విషయాన్ని లబ్దిదారులకు విస్తృత స్థాయిలో అవగాహన కల్పించాలని, మంజూరీ లు పొందిన లబ్ధిదారులు అందరూ వెంటనే ఇళ్ల నిర్మాణాలు చేపట్టి సకాలంలో పూర్తి చేసుకు నేలా ప్రోత్సహించాలని సూచించారు.  అదనపు కలెక్టర్ అంకిత్, ట్రైనీ కలెక్టర్ కరోలిన్ చింగ్తియాన్ మావీ, నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, హౌసింగ్ పీ.డీ పవన్ కుమార్, మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ రవిబాబు, వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు.