calender_icon.png 21 May, 2025 | 1:24 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకు కాషాయం జెండా ఉండాలి

12-04-2025 12:38:18 AM

ప్రజలకు కష్టం వచ్చినప్పుడు నిలబడిన వాడే నాయకుడు అవుతాడు 

నక్సలైట్లను, ఎర్రజెండాలను ఎదిరించి తెలంగాణలో బీజేపీ పాగా వేసింది

ఎమ్మెల్సీల అభినందన సభలో మెదక్ ఎంపీ రఘునందన్‌రావు

సిద్దిపేట, ఏప్రిల్ 11 (విజయక్రాంతి): భవిష్యత్తులో పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకు కాషాయం జండానే ఉండాలని మెదక్ పార్లమెంట్ సభ్యులు రఘునందన్ రావు సూచించారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో సిద్దిపేట జిల్లా పరిషత్ చైర్మన్ పదవితో పాటు మున్సిపాలిటీల చైర్మన్ పదవులను బిజెపి  దక్కించుకుంటుందని అందుకు కార్యకర్తలు ఆత్మవిశ్వాసంతో పని చేయాలని చెప్పారు.

భారతీయ జనతా పార్టీ సిద్దిపేట జిల్లా అధ్యక్షులు బైరి శంకర్ ముదిరాజ్ ఆధ్వర్యంలో శుక్రవారం సిద్దిపేటలో నిర్వహించిన ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీల అభినందన సభకు ఎంపీ రఘునందన్ రావు హాజరై మాట్లాడారు. బిజెపి పుట్టినప్పుడు ఇద్దరు ఎంపీలు మాత్రమే గెలిచారని హేళన చేసిన కాంగ్రెస్ పార్టీ నేడు దేశంలో మూడు రాష్ట్రాలకే పరిమితమైందని, అందుకు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నిబద్ధతతో చేసిన పని నిదర్శనమని చెప్పారు.

తెలంగాణలో బిజెపిని అడుగుపెట్టనీయమంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పందంగా ఉందన్నారు. మహబూబ్ నగర్ లో బిజెపి ఎంపీ డీకే అరుణ, చేవెళ్లలో  బిజెపి ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి, మల్కాజిగిరిలో ఈటెల రాజేందర్ లు సీఎం పక్కన కూర్చున్న కూడా ఆయనకి కనబడతలేరని విమర్శించారు. ఖాన్ కోల్ కే సునో సీఎం రేవంత్ రెడ్డి మిమ్మల్ని ఓడించింది కూడా కామారెడ్డి బిజెపి ఎమ్మెల్యే నే అని గుర్తు పెట్టుకోవాలని సూచించారు.

నక్సలైట్లను, ఎర్రజెండాలను ఏదిరించి తెలంగాణలో బిజెపి పార్టీ పాగా వేసిందని, అందుకు నరేంద్ర మోడీ గొప్ప నాయకత్వ లక్షణాలే కారణమన్నారు. సిద్ధిపేటలో లక్ష మెజారిటీ పక్కా అని ప్రచారం చేసిన వారికి 3000 మెజార్టీ దక్కిందంటూ హరీష్ రావు పై పరోక్షంగా విమర్శలు చేశారు. ఉత్తర తెలంగాణకు ఇద్దరు లక్ష్మి పుత్రులను ఇచ్చిన కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో త్రిమూర్తులుగా పనిచేసి మిమ్మల్ని గెలిపించుకోవడం మా బాధ్యత అంటూ కార్యకర్తల్లో జోష్ నింపారు. 

దుబ్బాక ఉప ఎన్నిక తర్వాత బిజెపి ఎక్కడైనా గెలుస్తుందనే నినాదం బలపడిందన్నారు. ఇప్పటినుంచి స్థానిక సంస్థల్లో మేమే గెలుస్తామనే నమ్మకంతో మీ గ్రామాలలో ప్రజలకు సేవలు అందించాలని సూచించారు. దుబ్బాక ఉప ఎన్నికల ప్రచారంలో సిద్దిపేటలోని ఓ లాడ్జిలో బిఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు డబ్బులు పంచుతున్నారనే విషయాన్ని తెలుసుకుని వారికి తగిన బుద్ధి చెప్పిన గొప్ప ఆత్మవిశ్వాసం కలిగిన నాయకులు మీరంటూ కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు.

సెంట్రల్ యూనివర్సిటీ వివాదంలో మొదటి ముద్దాయి కాంగ్రెస్ పార్టీ అయితే రెండవ ముద్దాయి బి ఆర్ ఎస్ పార్టీని సూచించారు. సెంట్రల్ యూనివర్సిటీకి కేటాయించిన భూములు అటవీ శాఖకు చెందినవైతే టీఎన్జీవో, హైకోర్టు అడ్వకేట్ కి ఇతర అవసరాల నిమిత్తం భూములు ఎట్ల కేటాయించారంటూ బిఆర్‌ఎస్ పార్టీ నాయకులను ప్రశ్నించారు. వారు చేసిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు ఆ పార్టీ అధ్యక్షులు కేటీఆర్ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని విరుచుకుపడ్డారు.

కాంగ్రెస్ బిఆర్‌ఎస్ పార్టీలది వీణా వాణిల బంధం అని పోల్చి చెప్పారు. ఎంత గొప్ప అనుభవజ్ఞులైన వైద్యులు వీణా వాణిలను వేరు చేయలేదని అందుకు వారిద్దరి మధ్య ఉన్న గొప్ప అనుబంధమేనని అదే విధంగా నేడు కాంగ్రెస్ బిఆర్‌ఎస్ పార్టీలు కొనసాగుతున్నాయని చెప్పారు. సెంట్రల్ యూనివర్సిటీ భూములను కాపాడేది బిజెపి పార్టీ మాత్రమేనని చెప్పారు. సెంట్రల్ యూనివర్సిటీ వివాదంలో కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడితే నోరు కరాబ్ అవుతుందని దుయ్యబట్టారు.

కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి హయాంలో మునిగిపోయే పడవ లాంటిదని అలాంటి దాని గురించి మాట్లాడకపోవడం చాలా మంచిదని చెప్పారు. సెంట్రల్ యూనివర్సిటీ భూముల విషయంలో బిజెపి ఎంపీ ఒకరు కాంగ్రెస్తో కలిసిపోయారని కేటీఆర్ చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఆ ఎంపీ ఎవరో పేరు బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. తప్పులు చేసిన వారిని వెనుకేసుకోవడం మీ పార్టీ కర్తవ్యం అయితే తప్పులు చేస్తే చర్యలు తీసుకునేది బిజెపి పార్టీ  అని చెప్పారు. ప్రెస్ మీట్ లు పెట్టి దాగుడుమూతలు ఆడే మాటలు మాట్లాడడం ఇకనైనా మానుకోవాలంటూ హితవు పలికారు. సమావేశం అనంతరం ఎమ్మెల్సీలు ముల్క కొమురయ్య, చిన్నమాలై అంజిరెడ్డి లను ఎంపీ రఘునందన్ రావు, జిల్లా అధ్యక్షులు బైరి శంకర్ ముదిరాజ్, పార్టీ నాయకులు, కార్యకర్తలు సన్మానించారు.