calender_icon.png 16 September, 2025 | 10:04 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హస్తినాపురంలోనే అర్బన్ దవాఖాన ఉండాలి

16-09-2025 12:00:00 AM

హెల్త్ సెంటర్ ఎదుట బీజేపీ నాయకులు ధర్నా 

ఎల్బీనగర్, సెప్టెంబర్ 15 : హస్తినాపురం అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ను హస్తినాపురం డివిజన్లోకి మార్చాలని బీజేపీ నాయకులు సోమవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ డివిజన్ అధ్యక్షుడు ఎరుకల మల్లేశ్ గౌడ్ మాట్లాడుతూ.. 2020లో కేంద్ర ప్రభుత్వ నిధులతో రాష్ట్ర ప్రభుత్వం హస్తినాపురం డివిజన్కు అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ను మంజూరు చేసిందన్నారు. అయితే, హెల్త్ సెంటర్ను హస్తినాపురం డివిజన్ పరిధిలో కాకుండా, మీర్ పేట్ మున్సిపాలిటీ పరిధిలోని రాఘవేంద్ర కాలనీలో ఏర్పాటు చేశారని తెలిపారు.

ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా హెల్త్ సెంటర్ను తక్షణమే హస్తినాపురం డివిజన్లోకి మార్చాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ పద్మానాయక్ స్వార్థపూరిత నిర్ణయంతో తమ బంధువుల ఇల్లు ఉన్న రాఘవేంద్ర కాలనీలోని చిన్న గదిలో అర్బన్ హెల్త్ సెంటర్ను ఏర్పాటు చేశారని ఆరోపించారు. ఐదు సంవత్సరాలుగా హస్తినాపురం డివిజన్ ప్రజలు ప్రభుత్వ వైద్య సేవలకు నోచుకోలేకపోతున్నారని అన్నారు.

సుమారు 50వేల మంది ప్రజలు నివసిస్తున్న హస్తినాపురం డివిజన్లో ప్రజలకు తగిన వైద్య సదుపాయాలు అందేలా,  హస్తినాపురం జడ్పీ రోడ్లో అర్బన్ హెల్త్ సెంటర్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. మాజీ కార్పొరేటర్ చేసిన తప్పిదాన్ని ప్రస్తుత కార్పొరేటర్ సుజాత నాయక్ కొనసాగించడం ఆమె అసమర్థ నాయకత్వానికి నిదర్శనమని విమర్శించారు. హస్తినాపురం ప్రజలను మోసం చేసిన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, కార్పొరేటర్ సుజాత నాయక్ బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

అనంతరం రాఘవేంద్ర కాలనీలో కొనసాగుతున్న అర్బన్ హెల్త్ సెంటర్ను తక్షణమే హస్తినాపురం జడ్పీ రోడ్కు మార్చాలని  అడిషనల్ డీఎంహెచ్ వో డిస్టిక్ హెల్త్ కోఆర్డినేటర్ రంజిత్ కుమార్ గౌడ్ కి వినతి పత్రాన్ని అందజేశారు. హస్తినాపురం ప్రజలకు అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ ద్వారా ప్రభుత్వ వైద్యసేవలు అందే వరకు బీజేపీ  పోరాటం కొనసాగిస్తుందని తెలిపారు. హెల్త్ సెంటర్ ను హస్తినాపురం జడ్పీ రోడ్ కు మార్చకపోతే ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఇల్లు ముట్టడిస్తామని బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యుడు గజ్జల రాజు గౌడ్ హెచ్చరించారు. 

కార్యక్రమంలో బీజేపీ  నాయకులు రాజేంద్ర ప్రసాద్, విజయ్ శ్రీ, బొమ్మిడి కిరణ్ రెడ్డి,  గౌని వెంకటేష్ గౌడ్, పాశం జీవన్ రెడ్డి, కంది శ్రీనివాస్ రెడ్డి, చంద్రకాంత్, శ్రీకాంత్ గౌడ్, సాయి కృష్ణారెడ్డి, మల్లేష్ యాదవ్, బాలరాజు, కాంతా రెడ్డి, శివకుమార్, బుర్రం ప్రకాశ్, మహేందర్ రెడ్డి, రాజవర్ధన్ రెడ్డి, అంజి ముదిరాజ్, పులికొండ, రామ్, నాగరాజు గౌడ్, మహేశ్, కుమార్, సుధీర్, కొండల్ తదితరులు పాల్గొన్నారు.