16-09-2025 12:00:00 AM
జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోత్ హుస్సేన్ నాయక్
శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 15(విజయక్రాంతి): నడిగడ్డ తాండా వాసులను సీఆర్పీఎఫ్, కస్టోడియన్ అధికారులు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇబ్బందులకు గురి చేయరాదని జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోత్ హుస్సేన్ నాయక్ స్పష్టం చేశారు. శేరిలింగంపల్లి మండలంలోని నడిగడ్డ తాండాలో సోమవారం జిల్లా ఎస్టీ వెల్ఫేర్ శాఖ ఆధ్వర్యంలో జరిగిన సమావేశానికి ముఖ్యఅతిథిగా ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల భద్రత మొదటి కర్తవ్యమని, ఆస్తుల రక్షణ ఆ తర్వాతే అని వ్యాఖ్యానించారు.
ఆస్తుల పేరుతో పేద గిరిజనులను ఇళ్లలోకి వెళ్లి భయభ్రాంతులకు గురి చేయడం సరైన పద్ధతి కాదని హెచ్చరించారు. నడిగడ్డ తాండాలోకి సీఆర్పీఎఫ్, కస్టోడియన్ అధికారులు వెళ్లకూడదని, నివాసాలు ఉన్న ప్రదేశం వరకు హద్దులు గుర్తించి ఫెన్సింగ్ వేసి మిగిలిన స్థలాన్ని రక్షించాలని సూచించారు. ఇందుకు సంబంధించిన పూర్తి నివేదికను వారంలోగా సమర్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. జాతీయ ఎస్టీ కమిషన్ రాజ్యాంగబద్ధమైన సంస్థగా గిరిజనుల హక్కుల పరిరక్షణకు కట్టుబడి ఉంటుందని హుస్సేన్ నాయక్ స్పష్టం చేశారు.
అనంతరం రంగారెడ్డి జిల్లా కలెక్టర్ సి. నారాయణరెడ్డి మాట్లాడుతు నడిగడ్డ తాండా సమస్యల పరిష్కారానికి ఈ వేదిక తొలి మెట్టుగా మారుతుందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ అధికారులతో సమన్వయం చేస్తూ తాండా వాసులకు అవసరమైన సదుపాయాలన్నీ కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, కస్టోడియన్ అధికారి కమలేశ్, సీఆర్పీఎఫ్ అధికారి అమిత్ మిశ్రా, మాజీ ఎంపీ రవీందర్ నాయక్, జిల్లా ఎస్టీ వెల్ఫేర్ అధికారి కే.ఈ. రామేశ్వరి, రాజేంద్రనగర్ ఆర్డీవో వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు..