కావాలనే కేటీఆర్‌పై బురదజల్లుతున్నరు
- పీసీసీ చీఫ్ హోదాకు తగ్గట్టు వ్యవహరించడం లేదు
- సీఎం రేవంత్‌రెడ్డి ఏ క్లబ్‌లో పేకాట ఆడుతున్నారో చెప్పాలా
- ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రవణ్
హైదరాబాద్, మార్చి 15 (విజయక్రాంతి): బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై కాంగ్రెస్ సోషల్ మీడియా కావాలని బురద జల్లుతున్నదని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ మండిపడ్డారు. రేవంత్ సహవాస దోషంతో పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్.. కేటీఆర్‌పై అనవసర విమర్శలు చేస్తున్నారని, పీసీసీ అధ్యక్ష పదవిలో ఉండి తన హోదాకు తగ్గట్టు వ్యవహరించడం లేదని విమర్శించారు.
కేటీఆర్‌కు మొయినాబాద్ ఫార్మ్ హౌజ్‌కు లింకు పెట్టడం అంటే మోకాలికి బోడి గుండుకు సంబంధం అంటగట్టడమేనని ఎద్దేవాచేశారు. రేవంత్‌రెడ్డి ఏ క్లబ్బులో, పబ్బులో తిరుగుతున్నారో, ఎక్కడ పేకాట ఆడుతున్నారో తాము చెప్పాలా? అని సవాల్ విసిరారు. ఆదివారం తెలంగాణ భవన్‌లో ఆయన మాట్లాడారు.
మాజీ ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి ఫార్మ్‌హౌజ్‌లో డ్రగ్స్ దొరికాయని పోలీసులు అంటున్నారని, ఇలాంటిది నిజమైతే దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. విచారణ జరిపి దోషులు ఎంతటి వారు ఉన్నా కఠినంగా శిక్ష వేయాలని సూచించారు. డ్రగ్స్ టెస్ట్ చాలెంజ్‌కు తాము సిద్ధంగా ఉన్నామని, గవర్నర్ ప్రసంగం ముగిసిన వెంటనే శాసనసభ ఆవరణలో డ్రగ్స్ టెస్ట్ పెట్టించాలని సూచించారు.




