29 March, 2026 | 7:08 AM

మీది గాడిద గుడ్డు పాలన

04-05-2024 01:03 AM

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హామీలిచ్చి గుడ్డు చూపిస్తున్నారు

హస్తం గుర్తు గాడిద గుడ్డుగా మారిందా?

కేసీఆర్ పీడ పోతుందనుకుంటే అబద్ధాల పాలన వచ్చింది

పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డ రాష్ట్రం

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ధ్వజం

హైదరాబాద్, మే 3 (విజయక్రాంతి): గతంలో మాజీ సీఎం కేసీఆర్ హామీలతో మసిపూసి మారేడుకాయ చేసేవారని.. ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రజలకు హామీలిచ్చి గాడిద గుడ్డు ఇస్తున్నా రని రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు, కేంద్రమంత్రి జీ కిషన్‌రెడ్డి విమర్శించారు. కేసీఆర్ పీడ పోవాలని ప్రజలు భావిస్తే మరో దుర్మార్గపు, అబద్ధాల గాడిద గుడ్డు పాలన వచ్చిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రజల పరిస్థితి పెనం నుంచి పొయ్యిలో పడినట్లు ఉందన్నారు. రేవంత్‌రెడ్డి నెత్తిన గాడిద గుడ్డు పెట్టుకుని తిరుగుతున్నారని, వాళ్ల పరిస్థితి చూస్తే పార్టీ సింబల్ చేయి గుర్తు నుంచి గాడిద గుడ్డుకు ఏమైనా మారిందా అనే అనుమానం కలుగుతోందని ఎద్దేవాచేశారు.

ఐదు నెలల్లో కాంగ్రెస్ అవినీతి మార్కును రేవంత్‌రెడ్డి చూపిస్తున్నారని ఆరోపించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఐటీ కంపెనీ యజమాని ఊరంగంటి వెంకటేశ్, దగ్గు విజేందర్‌రావు ఆధ్వర్యంలో పలువురు బీఆర్‌ఎస్ నాయకులు శుక్రవారం బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రోజురోజుకూ బీజేపీ గ్రాఫ్ పెరుగుతోందని, తెలంగాణలో తొలిసారి పక్కాగా డబుల్ డిజిట్ సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. 

చేయని పనులు కూడా..

లోక్‌సభ ఎన్నికల్లో ఎలాగూ అధికారంలోకి రాలేమని తెలుసుకున్న కాంగ్రెస్ పనికిమాలిన హామీలు ఇచ్చిందని కిషన్‌రెడ్డి అన్నారు. కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిపోయినట్లుగా తెలంగాణ ప్రజల బతుకు మారిందని తెలిపారు. బయ్యారం ఉక్కు పరిశ్రమను నిర్మిస్తామని కేసీఆర్ 2018లో హామీ ఇచ్చి మోసం చేశారని, రేవంత్‌రెడ్డి సైతం అదే విధంగా ప్రజలను మభ్యపెట్టారని విమర్శించారు. 28,942 ఉద్యోగాలు భర్తీ చేశామని రేవంత్ సర్కారు అబద్ధాలు చెబుతోందని, గత ప్రభుత్వం పెండింగ్‌లో ఉంచిన నియామకాల అపాయింట్‌మెంట్ లెటర్స్ ఇచ్చి తమ ఖాతాలో వేసుకుంటున్నారని అన్నారు. రూ.3,600 కోట్లతో నిర్మించే రామగుండం మణుగూరు రైల్వే లైన్ కోసం కేంద్రం నుంచి ఫైనల్ లొకేషన్ సర్వే జరుగుతోందని, రైల్వేల గురించి మాట్లాడే హక్కు కాంగ్రెస్ పార్టీకి లేదన్నారు.

రైల్వేలకు యూపీఏ హయాంలో, ఎన్డీఏ హయాంలో ఇచ్చిన నిధులపై చర్చకు రేవంత్ సిద్ధమా అని కిషన్‌రెడ్డి సవాల్ విసిరారు. వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో 2017 నుంచి కేంద్రం సైనిక్ స్కూల్ మంజూరుకు ముందుకు వచ్చినా అప్పటి బీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రభుత్వం సహకారం అందించలేదన్నారు. కొత్త నవోదయ పాఠశాలల ఏర్పాటుకు కేంద్రం చర్యలు ప్రారంభించిందని తెలిపారు. దేశంలోని మొట్టమొదటి సివిల్ ఏవియేషన్ రీసెర్చ్ ఆర్గనైజేషన్‌ను కేంద్రం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిందన్నారు. ప్రధాని మోదీ ఈ కేంద్రాన్ని ప్రారంభించారని గుర్తుచేశారు. 

హోర్డింగులతో అబద్ధపు ప్రచారం...

రాష్ట్రంలో గ్యారెంటీల విషయంలో కాంగ్రెస్ పార్టీ హోర్డింగులతో ప్రజలకు అబద్ధపు ప్రచారం చేస్తోందని కిషన్‌రెడ్డి ఆరోపించారు. 5 నెలల కాంగ్రెస్ పాలనలో కొత్తగా ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని, కానీ కార్డులు ఇచ్చినట్లుగా చెబుతోందన్నారు. మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాలు, మహిళలకు రూ.10 లక్షల జీవిత బీమా ఇవ్వలేదన్నారు. 100 రోజుల్లో 5 గ్యారెంటీలు అమలు చేశామంటూ, దావోస్ నుంచి రూ. 40,232 కోట్లను తీసుకువచ్చామంటూ, జర్నలిస్టులకు రూ.5 లక్షల జీవిత బీమా కల్పించినట్లుగా అసత్యాలు చెబుతున్నారని మండిపడ్డారు. రీజినల్ రింగ్ రోడ్డును కూడా కాంగ్రెస్ ఖాతాలో వేసుకున్నారని, కానీ ట్రిపుల్ ఆర్‌కు కర్త, కర్మ, క్రియ బీజేపీనేనని తెలిపారు. పంటల బీమా పునరుద్ధరణ అంటూ కాంగ్రెస్ అబద్ధాలు చెబుతోందన్నారు.

800 మెగావాట్ల రామగుండం ఎన్టీపీసీ రెండో యూనిట్‌ను ప్రధాని మోదీ ప్రారంభిస్తే తామే చేశామంటున్నారని చెప్పారు. రూ.5,800 కోట్లతో మూసీ అభివృద్ధి అన్నారు కానీ నిధులు విడుదల చేయలేదన్నారు. మహిళలకు రూ.500 గ్యాస్ సిలిండర్ ఇచ్చామన్నారని, ఇప్పటి వరకు ఎంత మందికి ఇచ్చారో చెప్పాలన్నారు. ప్రజావాణిలో ప్రజలు చేసుకున్న దరఖాస్తులు చెత్తకుప్పల్లో దర్శనమిచ్చాయని ఆరోపించారు. తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేం దుకు అత్యధిక ఎంపీ సీట్లు సాధించే బీజేపీపై బురదచల్లే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. 100 రోజుల్లో హామీలు నెరవేరుస్తామని ప్రజలకు వెన్నుపోటు పొడిచిన కాంగ్రెస్ పార్టీకి లోక్‌సభ ఎన్నికల్లో ఓట్లు అడిగే నైతిక హక్కు లేదన్నారు.

ఇచ్చిన హామీలు నెరవేర్చని కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఎక్కడికక్కడ నిలదీయాలన్నారు. మోదీ సునామీలో రేవంత్‌రెడ్డి కాళ్ల కింద భూమి కొట్టుకుపోతోందన్నారు. బీజేపీ గ్రాఫ్ పెరుగుతుంటే కాంగ్రెస్, బీఆర్‌ఎస్ ఎన్నికలకు ముందే చేతులెత్తేశాయన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ప్రజల్లో తిరిగే పరిస్థితి లేదన్నారు. గ్రామాల్లో కరెంటు కోతలు, మంచినీటి ఇబ్బందులు విపరీతంగా పెరిగిపోయాయని తెలిపారు. కాంగ్రెస్ అంటే కరెప్షన్, కరువు, దగా, కుటుంబ పాలన, ప్రజల మధ్య చిచ్చుపెట్టడమని.. ఇది కర్ణాటక, హిమాచల్‌లో రుజువైందన్నారు. ఇప్పుడు తెలంగాణలోనూ అదే ఒరవడి కొనసాగుతున్నదన్నారు.