calender_icon.png 6 July, 2025 | 12:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కూపన్లు ఇవ్వరు.. ఇసుక తోలుకోనివ్వరు!

01-07-2025 12:00:00 AM

ఇల్లెందు/టేకులపల్లి, జూన్ 30 (విజయక్రాంతి):ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు మొదలు కాక ముందు టేకులపల్లి మండలం ముర్రేడు వాగు నుంచి నిత్యం వందల ట్రాక్టర్ల ద్వారా ఇసుక రవాణా జరిగేది. ఎప్పుడైతే ఇందిరమ్మ ఇళ్ల నిర్మా ణాలు ప్రారంభించారో అప్పటి నుంచి ఇసుక బంగారం అయ్యింది. ఇదే ఆదనుగా కొందరు ట్రాక్టర్ల యజమానులు ఇసుకను కృత్రిమ కొరత సృష్టించి ట్రాక్టర్ ఇసుక ధర రూ. 5 వేలకు పైనే విక్రయిస్తున్నారు. వాస్తవంగా ఇందిరమ్మ ఇళ్లకే ఇసుక తీసుకెళ్లే ట్రాక్టర్లను కూపన్లు లేవన్న సాకుతో పోలీసులు పట్టుకుంటున్నారు.

దీనితో ఇ ల్లందు మున్సిపాలిటీతో పాటు, ఇల్లందు మండలం, టేకులపల్లి మండలాల్లో ఇసుక కొరతతో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ఇబ్బందిగా మారింది. బేస్ మెంట్ లెవల్ కు రెండు ట్రాక్టర్లు, స్లాబ్ లెవల్ కు 3 ట్రాక్టర్లు, ఆర్ సీసీ లెవల్కు 2 ట్రాక్టర్లు. ప్లాస్టింగ్, ఫ్లోరింగ్ కోసం మరో 3 ట్రిప్పులు మొత్తం 10 ట్రిప్పులు అంటే 30 క్యూబిక్ మీటర్ల ఇసుకను ఉచితంగా అందజేస్తుంది. అయితే ఇసుక నింపేందుకు లేబర్ ఖర్చులు, ట్రాక్టర్ కిరాయి లబ్దిదారుడే భరించాల్సి ఉంటుంది. దూరాభారాన్ని బట్టి ట్రాక్టర్ యజమా నికి ధర చెల్లించాల్సి ఉంది.

ప్రభుత్వం జిల్లాలో అను మతి ఉన్న ఇసుక రీచ్ల ద్వారా ఇందిరమ్మ ఇళ్లకు ఇసుకను సరఫరా చేస్తుంది. ఇల్లెందు, టేకులపల్లి మండలాలు, ఆళ్లపల్లి మండలంలోని కిన్నెరసాని, జిల్లేరు వాగు, లక్ష్మిదేవిపల్లి మండలంలోని మొర్రెడు వాగ్ రీచ్లు అందుబాటులో ఉన్నాయి. ఇవి కూడా ఇల్లెందు మండల శివారు గ్రామాలకు 60 కిలోమీటర్లు, టేకులపల్లి మండల శివారు గ్రామాలకు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. టేకులపల్లి మండలంలో 836 ఇల్లు మంజూరి కాగా, వాటిలో బెస్మేట్ లెవల్ కు ఇప్పటి వరకు వంద ఇల్లు కూడా చేరుకోలేదు.

ఇల్లెందు మున్సిపాటీలో 355, ఇల్లెందు మండలంలో 680 ఇల్లు మంజూరీ అయ్యాయి. ఇక్కడ కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ప్రారంభించిన కొందరు లబ్దిదారులు చేసేదిలేక ఒక్కో ట్రిప్పు రూ.5 వేలు వెచ్చించి నిర్మాణాలు చేపడుతున్నారు. ప్రభుత్వం ఇసుక ఉచితంగా అందజేస్తామని ప్రకటించి నప్పటికి కూపన్ల జారీ చేయక పోవడం వలన ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు ఇసుక ఇక్కట్లు తప్పడం లేదు. దగ్గర్లో ఉంటే తెచ్చుకోవచ్చని అధికారులు తెలుపుతున్న కూపన్లు లేవని ట్రాక్టర్లను పట్టు కోవడంతో ఎలా నిర్మిచుకోవాలో అర్ధం కానీ పరిస్థితిలో  లబ్ధిదారులు ఉన్నారు.