20-09-2025 12:56:41 AM
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 19: తెల్లవారుజామునే లేచి ఓట్లను డిలీట్ చేశారని, కేవలం 36 సెకండ్లలోనే పనికానిచ్చేసి.. మళ్లీ వెళ్లి పడుకున్నారని లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. శుక్రవారం ఎన్నికల సంఘం (ఈసీ)పై ఎక్స్‌వేదికగా మరోమారు ఆరోపణలు గుప్పించారు. ‘తెల్లవారుజాము నే 4 గంటలకు నిద్రలేచి.. 36 సెకండ్ల సమయంలో రెండు ఓట్లను తొలగించి.. మళ్లీ వెళ్లి పడుకున్నారు. ఇలాగే ఓట్ల చోరీ జరిగింది. ఓట్ల కాపలాదారు ఈసీ మేల్కొని చోరీని చూస్తూనే ఉంది.
ఓట్ల దొంగలను రక్షిస్తూనే ఉంది’ అని రాహుల్ పేర్కొన్నారు. గురువారం నాటి మీడియా సమావేశానికి సంబంధించిన వీడియోను ఆయన జత చేశారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేస్తున్న ఓట్ చోరీ ఆరోపణలకు మద్దతుగా పార్టీ ‘సంతకాల సేకరణ’ ప్రారంభించింది. కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ మద్దతు తెలుపుతూ సంతకం చేస్తున్న వీడియోను ఎక్స్‌లో పోస్ట్ చేశారు. మరో పక్క ఎన్నికల సంఘం రాహుల్ గాంధీ చేసిన ఓట్ చోరీ ఆరోపణలను తోసిపుచ్చింది. ఎవరూ ఆన్‌లైన్‌లో ఓట్లను డిలీట్ చేయలేరని పేర్కొంది.
యువత రాహుల్ మాటలు విశ్వసించరు:ఫడ్నవీస్
రాహుల్ గాంధీ చేసిన ఓట్ చోరీ ఆరోపణలను మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఖండించారు. రాహుల్ మాటలు అర్బన్ మావోయిస్టులా ఉన్నాయన్నారు. ‘రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని విశ్వసించడం లేదు. రాజ్యాంగబద్ధ సంస్థలను తిరస్కరిస్తున్నారు. రాహుల్ మాత్రమే కాకుండా రాహుల్ సలహాదారులు కూడా అర్బన్ మావోయిస్ట్ మైండ్‌సెట్‌తో ఉన్నారు. కానీ ఇండియాలో ఉన్న జెన్ జడ్ వర్గం రాజ్యాంగాన్ని విశ్వసిస్తోంది’ అని పేర్కొన్నారు.
బీజేపీ ఎంపీ, మాజీ కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ కూడా రాహుల్ గాంధీ ఓట్ చోరీ ఆరోపణలను తిప్పికొట్టారు. పాట్నాలో మాట్లాడుతూ.. ‘రాహుల్ గాంధీ దేశంలోని ప్రజాస్వామ్యాన్ని బలహీనపరిచేందుకు ఉద్దేశపూర్వకంగా ఒక క్రమపద్ధతిలో ప్రయత్నిస్తున్నారు. ఆయన దేశంలో అల్లర్లు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇది క్షమించరానిది’ అని అన్నారు.