20-09-2025 01:14:18 AM
హైదరాబాద్, సెప్టెంబర్ 19 (విజయక్రాంతి): ‘నా ఇంటికి వచ్చిన వాళ్లకు కండువా కప్పితే, వారు పార్టీ మారినట్లు అవుతుందా..? వారి మెడలో ఏ కండువా వేస్తానో వచ్చేవాళ్లకెలా తెలుస్తుంది’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం శుక్రవారం మీడియాతో చిట్‌చాట్ నిర్వహించారు. మీడియా ప్రతినిధులు పార్టీ ఫిరాయింపులపై అడిగిన ప్రశ్నలకు సీఎం సమాధానమిచ్చారు.
పార్టీ ఫిరాయింపుల అంశంపై కాంగ్రెస్ పార్టీ పరంగా నిర్దిష్ట నిర్ణయాలేమీ తీసుకోలేదని సీఎం స్పష్టం చేశారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ నెలవారీ జీతభత్యాల నుంచి ఇప్పటికీ నెలకు రూ.5 వేల చొప్పున బీఆర్‌ఎస్‌ఎల్పీకి వెళ్తుందని వివరించారు. బీఆర్‌ఎస్ పార్టీలో ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారనేది ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కే తెలియదని ఎద్దేవా చేశారు. తమ పార్టీకి 37 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని ఆ పార్టీ సభ్యుడు హరీశ్‌రావు అసెంబ్లీలో వెల్లడిస్తే, కేటీఆర్ ఆ సంఖ్యకు బదులు మరోసంఖ్య చెప్పటమే అందుకు నిదర్శనమన్నారు.
‘కల్వకుంట్ల కుటుంబంలో ఆస్తి పంపకాల వివాదం జరగుతున్నది. దీనిలో భాగంగానే కవిత వివా దం తెరమీదకు వచ్చింది. ఒక ఆడబిడ్డపై నలుగురు కలిసి దాడి చేస్తున్నారు. కవితను బయటకు వెళ్లగొట్టింది బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పార్టీ నేత హరీశ్‌రావు, మాజీ ఎంపీ సంతోష్‌రావే. ఆ కుటుంబ వ్యవహారంతో సామాన్య ప్రజలకు ఎలాంటి సంబంధం లేదు. నాకూ ఎలాంటి సంబంధం లేదు.
కేసీఆర్ కుటుంబాన్ని ప్రజలు ఎప్పుడో సామాజికంగా బహిష్కరించారు. 2014 19 మధ్య బీఆర్‌ఎస్ ప్రభుత్వ క్యాబినెట్‌లో ఒక్క మహిళైనా లేదు. కవిత కాంగ్రెస్‌లో చేరతామంటే మేం ఒప్పుకోం. కేసీఆర్ కొన్ని వందల మంది పిల్లల ఉసురు పోసుకున్నారు. ఉద్యమం పేరుతో ప్రాణాలు బలితీసుకున్నారు. ఎంతోమంది తల్లిదండ్రులకు కేసీఆర్ కడుపుకోత మిగిల్చారు. ఆ ఉసురుతోనే కేసీఆర్‌కు తన కుమార్తె దురమయ్యారు. గతంలో నన్ను నా కుమార్తె పెళ్లికి వెళ్లనివ్వకుండా అడ్డుకున్నారు.
కర్మ ఎవరినీ వదిలిపెట్టదు’ అని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్‌ను బీజేపీలో విలీనం చేసేందుకు ప్రయత్నం జరిగిందనేది కేసీఆర్ కుటుంబ సభ్యులే చెప్పడాన్ని అందరూ గుర్తుంచుకోవాలన్నారు. షాడో సీఎం అంశంపై సీఎంను మీడి యా ప్రశ్నించగా.. ‘ఊరికే షాడో సీఎం అనడం కాదు.. ఆ వ్యక్తిపేరు, ఆ వ్యక్తి షాడో సీఎంగా చేసిన పనేంటో చెప్పాలి’ అని హితవు పలికారు.
మెట్రోను అడ్డుకుంటున్నది కిషన్‌రెడ్డి, కేటీఆరే..
హైదరాబాద్‌లో మెట్రో విస్తరణను అడ్డుకుంటున్నది కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, మాజీ మంత్రి కేటీఆర్ అని సీఎం ఆరోపించారు. కిషన్‌రెడ్డికి సొంత తెలివి లేదన్నారు. అయినప్పటికీ కిషన్‌రెడ్డిని కేటీఆర్ అద్దెకు పెట్టుకు న్నారని ఎద్దేవా చేశారు. కేటీఆర్ ఏది చెబితే ఢిల్లీలో కిషన్‌నెడ్డి అదే పనిచేస్తున్నారని ఆరోపించారు. ఎల్‌అండ్‌టీతో ఒప్పం దం ఉంటేనే మెట్రో విస్తరణకు అనుమతులు ఇస్తామని కేంద్ర ప్రభుత్వ తెగేసి చెప్తున్నదని, అసలు ఆ సమస్య సృష్టించిందే కిషన్‌రెడ్డి అని ఆరోపించారు.
మె ట్రో ప్రాజెక్టు వ్యయానికి ఎల్‌అండ్‌టీ అడుగుతున్న మొత్తానికి ఎంతో వ్యత్యాసం ఉందని, ఎల్‌అండ్‌టీ పునరాలోచించి రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్‌లో చివరి మైలు వరకు మెట్రో విస్తరించాలనేది తమ ప్రభుత్వ లక్ష్యమని వెల్లడించారు. గత సీఎం కేసీఆర్ అనాలోచిత చర్యల వల్లే మెట్రో వల్ల రాష్ట్రప్రజలపై రూ.3 వేల కోట్ల భారం పడిందని ఆరోపించారు. మెట్రో విస్తరణ జరిగితే రోజుకు 15 లక్షల మందికి పైగా ప్రయాణం చేస్తారని వివరించారు.
కాళేశ్వరం అవకతవకలపై దర్యాప్తును సీబీఐకి ఇవ్వాలని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి పదేపదే అడిగారని, రాష్ట్రప్రభుత్వం సీబీఐకి అప్పగించిన 48 గంటల్లోనే విచారణ చేపట్టేలా చూస్తానని ప్రకటించారని గుర్తుచేశారు. తమ ప్రభుత్వం ఆ కేసును సీబీఐకి అప్పగించి, రోజులు గడుస్తున్నా కిషన్‌రెడ్డి నుంచి ఎందుకు స్పందన లేదని నిలదీశారు.సీబీఐ దర్యాప్తును ఆపమని కేటీఆర్ చెప్పినందు వల్లే కిషన్‌రెడ్డి మిన్నకుంటున్నారని ఆరోపించారు.
కమిషన్ అంటే నిజానిజాలు నిర్ధారణ చేసే ఒక వ్యవస్థ అని, దీనిలో భాగంగానే పీసీ ఘోష్ కమిషన్ మొత్తం 132 మందిని విచారించి, వారి వాంగ్మూలాలు నమోదు చేసిందని గుర్తుచేశారు. కమిషన్ చివరకు ఎవరు.. ఏ తప్పు చేశారో నిర్ధారించిందన్నారు.
ఇప్పుడు సీబీఐ మళ్లీ ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి మొదటి నుంచి దర్యాప్తు చేయాల్సి ఉంటుందని అభిప్రాయపడ్డారు. కాళేశ్వరం బరాజ్‌లపై సీబీఐ దర్యాప్తునకు రాష్ట్రప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుందని, ఫోన్ ట్యాపింగ్ కేసు హైకోర్టులో లేకపోతే, ఆ కేసును కూడా సీబీఐకి ఇచ్చే వాళ్లమని తేల్చిచెప్పారు.
మావోయిస్టులపై దాడులు సరికాదు..
కేంద్ర ప్రభుత్వం మావోయిస్టులపై దాడులు చేయడం సరికాదని సీఎం అభిప్రాయపడ్డారు. పాకిస్థాన్ ఉగ్రవాదంపై చర్చలు జరుపుతూ, సొంత పౌరులైన మావోయిస్టులతో మాత్రం ఎందుకు చర్చలు జరపట్లేదని కేంద్రాన్ని ప్రశ్నించారు. ఆయుధాలు వదిలి మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలిసిపోతామన్న అభ్యంతరాలు ఎందుకని నిలదీశారు. కేంద్రం ఇప్పటికైనా మావోయిస్టులపై ఒక విధానపరమైన నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తిచేశారు. హైదరాబాద్‌లో డ్రగ్స్ కట్టడికి సమగ్రమైన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
తెలంగాణ పోలీసులు గోవా, పుణేలోనూ ప్రత్యేక ఆపరేషన్లు నిర్వహించారని, డ్రగ్స్ భూతాన్ని తరమికొడుతున్నారని వెల్లడించారు. పదేళ్లపాటు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్ డ్రగ్స్ విషయాన్ని పట్టుకోలేదని మండిపడ్డారు. తన బావమరిది ఫాంహౌస్‌లో డ్రగ్స్ దొరికినప్పుడు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాష్ట్రప్రభుత్వాన్నిఅభినందిస్తే బాగుండేదని, అదే చేసి ఉంటే కేటీఆర్‌ను ఎవరూ శంకించేవారు కాదన్నారు. దుబాయ్‌లో ఇటీవల చనిపోయిన సినీ నిర్మాత కేదార్ ఫోరెన్సిక్ రిపోర్టు తమ ప్రభుత్వానికి అందిందని తెలిపారు.
గోదావరి జలాలపై 75 ఏళ్ల రికార్డులను పరిశీలిస్తున్నాం..
గోదావరి జలాల్లో తెలంగాణకు 968 టీఎంసీల కేటాయింపు ఉందని, ఈ అంశంపై తమ ప్రభుత్వం ప్రస్తుతం 75 ఏళ్ల రికార్డులు పరిశీలిస్తున్నట్లు సీఎం స్పష్టం చేశారు. పదేళ్లపాటు రాష్ట్రాన్ని పాలించిన బీఆర్‌ఎస్ గోదావరి జలాల అంశాన్ని పట్టించుకోలేదని, దీంతో జలాల కేటాయింపు అంశంపై గందరగోళం నెలకొన్నదని తెలిపారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఒక ప్రాజెక్టు ఆయకట్టును మరో ప్రాజెక్టులో చూపించిందని మండిపడ్డారు.
తుమ్మడిహట్టి ప్రాజెక్ట్ కోసం మిగులు జలాలు వాడుకుంటామని సీఎం వెల్లడించారు. మహారాష్ట్ర ప్రభుత్వం నుంచి అపా యింట్‌మెంట్ వచ్చాక, తాము అక్కడికి వెళ్లి తుమ్మడిహట్టి సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై తమ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తున్నదని, బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌పై రాష్ట్రప్రభుత్వం చేసిన బిల్లులు ఇప్పటికీ రాష్ట్రపతి వద్దే పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు.
రాష్ట్రపతి తీసుకునే గడువు అంశం ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఉందన్నారు. ఈ అంశంలో సుప్రీం కోర్టు ఏం చెప్తుందోనని తమ ప్రభుత్వం వేచి చూస్తున్నదని, న్యాయనిపుణులతో చర్చించి, తదుపరి నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. ‘మళ్లీ కోర్టుకు వెళ్లాలా..? లేదా..? అనే అంశంపై తామిప్పుడే నిర్ణయం తీసుకోలేము’ అని తెలిపారు.