20-09-2025 12:56:43 AM
భీంగల్,(విజయక్రాంతి): భీంగల్ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మండల అభివృద్ధి అధికారి ఆధ్వర్యంలో “ఇందిరా సౌర గిరి జలవికాసం” పై మండల స్థాయి, గ్రామ స్థాయి అధికారులకు అవగాహన సమావేశం నిర్వహించబడింది. ఈ సందర్భంగా ఎంపీడీవో గంగుల సంతోష్ కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వం పంపిణీ చేసిన పోడు భూములలో సౌర విద్యుత్తు, ఇతర అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టుటకు సంబంధిత శాఖలు కృషి చేయాలని సూచించారు. వ్యవసాయ శాఖ, అటవీ శాఖ, ఉద్యానవన శాఖ, ఉపాధి హామీ పథకం, భూగర్భ జల శాఖ, విద్యుత్ శాఖ, పంచాయతీరాజ్ శాఖ గ్రామ, మండల స్థాయి అధికారులు సమన్వయంతో ముందుకు సాగాలని తెలిపారు.
ముఖ్యంగా తొమ్మిది గిరిజన గ్రామాలలో పోడు భూములు పొందిన రైతుల భూముల ప్రస్తుత స్థితిగతులపై వ్యవసాయ శాఖ నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ఉపాధి హామీ సిబ్బంది పోడు భూముల అభివృద్ధి కోసం చేపట్టవలసిన పనుల వివరాలు సమర్పించాలని సూచించారు. భూగర్భ జలాధికారులు నీటి లభ్యతపై సర్వే చేసి నివేదిక అందించాలన్నారు. ఉద్యానవన శాఖ అధికారులు ఆ భూముల్లో పండ్ల తోటలకు అనుకూలతపై వివరాలు ఇవ్వాలని సూచించారు.
ఫారెస్ట్ అధికారులు వాస్తవ స్థితిగతులపై సర్వే బృందానికి వివరాలు అందించాలని ఆదేశించారు. విద్యుత్ శాఖ అధికారులు సంబంధిత గ్రామాలను సందర్శించి విద్యుత్ సౌకర్యం ఉన్న రైతుల వివరాలు ఇవ్వాలని సూచించారు. గ్రామస్థాయి సర్వేలో అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ అధికారులు, పంచాయతీ కార్యదర్శులు, ఉపాధి హామీ సిబ్బంది, ఫారెస్ట్ బీట్ అధికారులు, ఇతర సంబంధిత అధికారులు పాల్గొనివాస్తవ లబ్ధిదారుల వివరాలు సేకరించాలని ఎంపీడీవో గంగుల సంతోష్ కుమార్ సూచించారు.