20-09-2025 01:24:31 AM
* ఎల్ అండ్ టీ సొంత తప్పిదాలు, నిర్వహణ లోపాలు, సంస్థకు కేటాయించిన స్థలాలను సరిగా వినియోగించుకోకపోవడం మూలాన నష్టం వాటిల్లింది. నిజంగా చెల్లింపుల్లో జాప్యం, విధాన పరమైన మార్పులు ఉంటే మధ్యవర్తిత్వం ద్వారా ఆ సమస్యలను పరిష్కరించుకోవచ్చు. న్యాయనిపుణులతో కమిటీని ఏర్పాటు చేసి ఒప్పందాన్ని రద్దు చేసుకోవడం, నిబంధనల ఉల్లంఘనలకు జరిమానా విధించాలి. కానీ ఏకపక్షంగా ప్రాజెక్టు నిర్వహణ నుంచి తప్పుకోవడం పరిష్కారం కాదు. ఇది ముమ్మాటికీ దోపిడీ అవుతుంది.
* హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టు రెండో దశకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో సంప్రదింపులు జరుపుతూ, అనుమతుల ప్రక్రియను వేగవంతం చేస్తున్న తరుణంలో లారెన్స్ అండ్ టూబ్రో (ఎల్ అండ్ టీ) వ్యవహారం పంటికింది రాయిలా మారింది. మెట్రో నిర్వహణ బాధ్యతల నుంచి తప్పుకుంటామని ఎల్ అండ్ టీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖలు రాసింది.
తమకు బకాయిల కింద రావాల్సిన రూ. 6 వేల కోట్లను మంజూరు చేసి, మెట్రో నిర్వహణను రాష్ట్ర ప్రభుత్వం తమ ఆధీనంలోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది. అయితే హైదరాబాద్ మెట్రో ప్రాజెక్టు ప్రారంభంలో ఎల్ అండ్ టీ తక్కువ మొత్తానికి బిడ్ దాఖలు చేయడం మొదలు మెట్రో నిర్వహణలో తాము ఎన్నో సాధకబాధకాలను ఎదుర్కొంటున్నామని గీరాలు తీయడం దాకా ఆ కంపెనీ ప్రస్థానం సాగింది.
ఇప్పుడు ప్రాజెక్టు నుంచి తప్పుకుంటామని చల్లగా చెప్పడం వెనుక సామాన్యులు, పన్ను చెల్లింపుదారుల ధనాన్ని లూటీ చేసే ఆర్థిక సంక్షోభాన్ని రాష్ట్రం నెత్తిన రుద్దే బాగోతానికి తెరతీయనుంది. వేల కోట్ల ఆర్థిక సంక్షోభానికి కారణం కానున్నప్పటికీ కుంటి సాకులతో మెట్రో నిర్వహణ నుంచి ఎల్ అండ్ టీ తప్పుకోవాలని చూస్తున్నది. ఇదేదో తాము రాష్ట్రానికి మేలు చేస్తున్నట్లు చెప్పుకుంటున్నది.
కానీ ఎల్ అండ్ టీతో జరిగిన ఒప్పందకాలం పూర్తికానట్లయితే రాబోయే రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వంపై రూ.50 వేల కోట్ల ఆర్థిక భారం పడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇది కేవలం కాంట్రాక్ట్ వివాదం మాత్రమే కాదు, ప్రైవేటు సంస్థలు ప్రజల మౌలిక సదుపాయాలను ఆబగా హైజాక్ చేస్తూ బేలౌట్‌ల పేరిట సామాన్యులపై ఎలా ఆర్థిక భారం మోపుతాయనేందుకు ఇది మచ్చుతునక.
నిజానికి దశాబ్దం క్రితం అతి తక్కువ బిడ్‌తో పబ్లిక్, ప్రైవేట్ భాగస్వామ్యం (పీపీపీ) మోడల్‌లో తలదూర్చింది. ఎల్ అండ్ టీ కంపెనీ-తో హైద రాబాద్ మెట్రో పీపీపీ కింద మొత్తం 35 సంవత్సరాలకు ఒప్పందం కుదుర్చుకున్నది. మరో 25 ఏళ్లు దానిని పొడిగించు కునే వెసులుబాటు ఉంది. దేశంలో మొదటిసారి పీపీపీ మోడల్‌లో ప్రాజెక్టును చేప ట్టడం విశేషంగా నిలిచింది. వాస్తవానికి టెండర్ల సమయంలో మెట్రో రైలు ప్రాజెక్టును ఎలాగైనా దక్కించుకోవాలనే ఆలోచ నతో ఎల్ అండ్ టీ కంపెనీ రూ. 14 వేల కోట్లకు బిడ్ వేసింది.
అయితే నిర్మాణంలో జాప్యం కారణంగా ప్రాజెక్టు పూర్తయ్యే సరికి అది రూ.20 వేల కోట్లకు చేరుకుంది. దీనికి తోడు రోజువారీ 15 నుంచి 20 లక్షల మంది ప్రయాణీకులు మెట్రోను వినియోగిస్తారని అంచనా వేసింది. కానీ ప్రతిరోజూ 4 నుంచి 5 లక్షల మంది మాత్రమే మెట్రోలో ప్రయాణించినట్టు గణాంకాలు చెబుతున్నాయి. ఆరేళ్ల నిర్వహణ తర్వాత రూ. 13 వేల కోట్ల అప్పు, రూ. 2 వేల కోట్ల లోటును చూపుతున్నది.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమలుచేస్తున్న ఉచిత బస్సు ప్రయాణాన్ని సాకుగా చూపుతూ నష్టాలను చవిచూస్తున్నామని ఎల్ అండ్ టీ చెబుతున్నది. అందుకే మెట్రో నిర్వహించలేమని, రెండో ఫేజ్‌లో కూడా భాగ స్వాములుగా ఉండలేమని ప్రభుత్వానికి తేల్చి చెప్పింది. ఇందులో భాగంగా తన 90% వాటాను కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వానికి బదిలీ చేయడానికి ముందుకొచ్చింది.
ఇదొక మచ్చలా మిగిలిపోతుంది..
అయితే మెట్రో ప్రాజెక్టు నుంచి బయటపడేందుకు ఎల్ అండ్ టీ సంస్థ చూపుతున్న సాకులు ప్రభుత్వ విశ్వసనీయతను దెబ్బతీసే ప్రమాదం ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన పథకమైన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కారణంగా మెట్రో ప్రయాణీకులు తగ్గిపోయారని ఎల్ అండ్ టీ ఆరోపించింది. రోజువారీ రాకపోకలు, 2024, ఆగస్టులో గరిష్ఠంగా 5.63 లక్షల నుండి ఇప్పుడు 4.5 లక్షల కంటే తగ్గాయని చెప్పింది.
ఆదాయం 21 శాతం తగ్గి రూ.1,108 కోట్లకు పడిపోయిందని, నష్టాలు 13 శాతం పెరిగి రూ.626 కోట్లకు చేరుకున్నాయని వెల్లడించింది. మెట్రో వినియోగంపై మహాలక్ష్మి పథ కం వల్ల పడిన ప్రభావాన్ని లెక్కించే అధ్య యనాలను అటు ఎల్ అండ్ టీ గానీ, ఇటు ప్ర భుత్వం గానీ ఇప్పటివరకు విడుదల చేయకపోవడం గమనార్హం.
ప్రయాణీకుల సంఖ్య, ఆదాయం తగ్గుదల, నష్టాలు పెరగడం వంటి అంశాలను చూపి ఎల్ అండ్ టీ రూ. 6 వేల కోట్లు డిమాండ్ చేస్తున్నది. దీనికి రాష్ట్ర ప్రభుత్వం అంగీకరిస్తే తెలంగాణ చరిత్రలో ఇదొక అతిపెద్ద కుంభకోణం అయ్యే అవకాశం ఉంది. రాష్ట్ర భవిష్యత్‌పై మాయని మచ్చలాగా మిగిలిపోనున్నది.
ఇది ముమ్మాటికీ దోపిడే..
ఎల్ అండ్ టీ నుంచి మెట్రో రైలు బాధ్యతను తీసుకోవడమంటే కేవలం నష్టాలను మాత్రమే కాదు, మిగిలిన 55 సంవత్సరాల రాయితీ పూర్తి భారాన్ని కూడా ప్రభుత్వమే భరించాలి. ప్రస్తుత అంచనాల ప్రకారం మెట్రో నిర్వహణ, నష్టాల భర్తీ, రెండో దశ విస్తరణకు రూ. 50 వేల కోట్లు అవసరమవుతాయి. ఈ నిధులతో కరువుతో బాధపడుతున్న రైతులకు పరిహారం, ఉచిత విద్య, ఆరోగ్య సంరక్షణ, నీటి పారుదల ప్రాజెక్టులను పూర్తి చేసుకోవచ్చు.
అయితే మెట్రోలోనే ప్రయాణీకులకు సబ్సిడీని ప్రభుత్వం అందించాలనే ఉద్దేశంతోనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని మెట్రో నష్టాలకు కారణంగా ఆ సంస్థ చూపిందని తెలుస్తోంది. 2024 మేలో ఎల్ అండ్ టీ సీఎఫ్‌వో శంకర్ రామన్ ఉచిత బస్సు ప్రయాణం ‘ప్రయాణీకులకు అంతరాయం కలిగిస్తుంద’ని అభివర్ణించారు. అయినా సీఎం రేవంత్‌రెడ్డి పథకం అమలుపై వెనక్కి తగ్గలేదు.
అయితే తక్కువ ప్రయాణీకుల సంఖ్య, కొవిడ్ విపత్కర పరిస్థితులను సాకుగా చూపుతూ ఎల్ అండ్ టీ గతంలోనే మెట్రో బాధ్యతలను తప్పుకోవాలని ప్రయత్నించింది. 2023లో ఛార్జీల పెంపు తర్వాత ‘సేవ్ యువర్ మెట్రో’ పేరుతో ప్రచారాన్ని ప్రారంభించారు. కానీ ఎల్ అండ్ టీ సొంత తప్పిదాలు, నిర్వహణ లోపాలు, సంస్థకు కేటాయించిన స్థలాలను సరిగా వినియోగించుకోకపోవడం మూలాన ఈ నష్టం వాటిల్లింది.
నిజంగా చెల్లింపుల్లో జాప్యం, విధాన పరమైన మార్పులు ఉంటే మధ్య వర్తిత్వం ద్వారా ఆ సమస్యలను పరిష్కరించుకోవచ్చు. న్యాయ నిపుణులతో కమిటీని ఏర్పాటు చేసి ఒప్పందాన్ని రద్దు చేసుకోవడం, నిబంధనల ఉల్లంఘనలకు జరిమానా విధించాలి. కానీ ఏకపక్షంగా ప్రాజెక్టు నిర్వహణ నుంచి తప్పుకోవడం పరిష్కారం కాదు. ఇది ముమ్మాటికీ దోపిడీ అవుతుంది.
ప్రతిపక్షాల ఆరోపణలకు అవకాశం..
మెట్రో ప్రాజెక్టు నుంచి ఎల్ అండ్ టీ తప్పుకునేందుకు ప్రభుత్వం ఒకవేళ రూ. 6 వేల కోట్ల పరిహారం చెల్లిస్తే ప్రభుత్వంపై ఆరోపణలు చేసేందుకు ప్రతిపక్షాలకు అవకాశం ఇచ్చినట్టే అవుతుంది. ఈ చర్య రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తుంది. ఈ అంశంపై ఇప్పటికే బీఆర్‌ఎస్, బీజేపీ విమర్శనాస్త్రాలకు పదును పెడుతున్నాయి.
ఎన్నికల నిధుల కోసమే ఎల్ అండ్ టీకి వేల కోట్లను పరిహారంగా ఇచ్చిందని, ప్రజలపై రూ. 50 వేల కోట్ల ఆర్థిక భారాన్ని మోపుతూ ఎల్ అండ్ టీ తప్పించుకునేందుకు అవకాశం కల్పించిందని ప్రతిపక్షాలు ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తాయి. మెట్రో ప్రాజెక్టులో ఎల్ అండ్ టీ వ్యవహారాన్ని ప్రతిపక్షాలు అనుకూలంగా మలుచుకునే ప్రమాదమూ ఉంది.
ఆదాయమున్నా.. కావాలనే..
టికెటింగ్, అడ్వర్టయిజింగ్, మాల్స్, పార్కింగ్ ఇలాంటి వాటితో ఆదాయం బాగానే సమకూరుతున్నా.. ఖజానా నింపుకుని, నష్టాలు తగ్గించుకుని బయటపడేందుకే ఎల్ అండ్ టీ చూస్తోందన్న వాదన వినిపిస్తున్నది. ఎందుకంటే హైదరాబాద్ మెట్రోలో జనం విపరీతంగా పెరిగారు. అయితే నష్టాలను సాకుగా చూపుతూ జనాలకు మెట్రో సేవలను పరిమితంగా అందిస్తోందన్న ఆరోపణలు పెరుగుతున్నాయి.
కనీసం పెరిగిన రద్దీకి తగ్గట్లు మౌలిక వసతులను కల్పించడంలో నిర్వహణ విఫలమైందని, అందుకే మెట్రో తరచూ టెక్నికల్ ఇష్యూస్ వస్తున్నాయంటున్నారు. నిజానికి పెరుగుతున్న రద్దీ ప్రకారం మెట్రోకు అదనపు బోగీలను ఏర్పాటు చేయాల్సి ఉంది. కానీ ఇప్పటివరకు వెయ్యి మంది ప్రయాణించేందుకు వీలుగా యావరేజ్‌గా మూడు బోగీలు మాత్రమే ఉంటున్నాయి. వీటిలోనూ పరిమితికి మించి జనం ప్రయాణిస్తుండడంతో తరచూ సాంకేతిక సమస్యలు వస్తున్నాయి.
గడిచిన ఏడాదిన్నర కాలంగా మెట్రోకు అదనంగా మూడు బోగీలు తీసుకురావాలనే ప్రతిపాదనలు ఉన్నాయి. నిజానికి టిక్కెట్ల అమ్మకాలతో 622.99 కోట్ల రూపాయలు ఆర్జించింది. అలాగే రెంటల్ ఇన్‌కంతో 114.89 కోట్లు వస్తున్నాయి. అడ్వర్టుజింగ్‌తో స్టేషన్ల దగ్గర, ట్రైన్లపై, డిజిటల్ బోర్డులు ఇలాంటి వాటితో 105.39 కోట్లు సంపాదిస్తోంది.
కన్సల్టెన్సీ, రియల్ ఎస్టేట్ ట్రాన్స్‌ఫర్, కన్స్ట్రక్షన్ వంటి వాటితో 353.73 కోట్లు ఆర్జిస్తోంది. కానీ ఆర్థిక భారం పేరుతో ఉన్న బోగీలతోనే నెట్టుకొస్తున్నారు. దీంతో జనం కిక్కిరిసి ప్రయాణిస్తున్నారు. ఒకవైపు 2050 నాటికి 31 రూట్లు 662 కిలోమీటర్లు విస్తరించాలని రాష్ర్ట ప్రభుత్వం అంచనాలు వేస్తుంటే.. ఇంకోవైపు ఎల్ అండ్ టీ మెట్రో నుంచి తప్పుకోవాలని చూస్తుంది.
సి.ఎల్.రాజం
చైర్మన్, విజయక్రాంతి