డిజిటల్ అరెస్ట్‌తో ముప్పే!
ఇటీవలి కాలంలో డిజిటల్ అరెస్ట్ అనేది దేశంలో ఆర్థిక నేరాలకు సంబంధించి పెద్ద సమస్యగా మారిపోతున్నది. కస్టమ్స్, క్రైమ్ బ్రాంచ్, సీబీఐ, ఈడీ పేర్లతో సైబర్ నేరగాళ్లు సామాన్యులకు ఫోన్లు చేస్తూ అందినకాడికి దోచుకుంటున్నారు. డిజిటల్ అరెస్ట్ పేరుతో జరుగుతున్న సైబర్ మోసాలపై రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము సహా దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సైతం ఆందోళన వ్యక్తం చేయడం చూస్తుంటే పరిస్థితి ఎంత ప్రమాదకరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
డిజిటల్ అరెస్ట్ అనేది ప్రజల భద్రతకు పెద్ద ముప్పుగా మారిందని, సైబర్ నేరాలపై ప్రజలకు పోలీసులు సరైన అవగాహన కల్పిస్తే మంచిదని ముర్ము పేర్కొన్నారు. డిజిటల్ అరెస్ట్ అనేది వ్యవస్థలో ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీసేందుకు దోహ దపడుతుందని సుప్రీంకోర్టు పేర్కొంది. అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో డిజిటల్ అరెస్ట్ పేరుతో నమోదైన ఎఫ్‌ఐఆర్, ఫిర్యాదుల వివరాలకు సంబంధించిన సమాచారాన్ని అందించాలని కోరింది.
ఇలాంటి నేరాలు పాన్ ఇండియా స్థాయిలో జరుగుతున్నందున డిజిటల్ అరెస్ట్ కేసులపై సీబీఐ చేపట్టే విచారణను దగ్గరుండి పర్యవేక్షిస్తామని తెలిపింది. ప్రస్తుతం డిజిటల్ అరెస్ట్ పేరుతో చేస్తున్న ఆన్‌లైన్ మోసాలు మరింత ఆధునాతనంగా మారుతున్నాయి. సైబర్ నేరగాళ్లు చట్టాలను అమలు చేసే అధికారులుగా నటిస్తూ సామాన్యలకు వాట్సాప్, స్కైప్ వంటి ప్లాట్‌ఫాంల ద్వారా ఫోన్ కాల్స్ చేస్తుంటారు.
సీబీఐ, ఆదాయపు పన్ను అధికారులమంటూ పేర్కొంటూ మీ కుటుంబ సభ్యుల్లో ఒకరు మనీలాండరింగ్, పన్ను ఎగవేత, అక్రమ లావాదేవీలు జరిపారంటూ నేరాభియోగాలు మోపుతున్నారు. డబ్బులు కాజేయడానికి బ్యాంకు వివరాలు, ఇతర ము ఖ్యమైన వివరాలు సేకరిస్తారు. అరెస్టును నివారించాలంటే బ్యాంకు వివరాలు అందించడమే మార్గమని చెబుతూ భారీ మొత్తాన్ని తమకు డిపాజి ట్‌గా పంపాలని, కేసు క్లియర్ కాగానే ఆ డబ్బులు తిరిగి ఇస్తామంటారు. వివరాలు వెల్లడించకుంటే అరెస్ట్ చేస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నారు.
నిజమైన అధికారులేమోనన్న భయంతో ప్రజలు కూడా తమ వ్యక్తిగత వివరాలు వెల్లడించి మోసపోతున్నారు. గడిచిన రెండేళ్లలో డిజిటల్ అరెస్ట్ మోసాల కారణంగా సామాన్యుల నుంచి సైబర్ నేరగాళ్లు రూ. 2500 కోట్లకు పైగా దోచుకున్నట్లు ఇండియన్ ఎక్స్‌ప్రెస్ నివేదిక వెల్లడించింది. తెలంగాణలో గత తొమ్మిది నెలల్లో 933 మంది నుంచి సుమారు రూ. 60 కోట్లు కాజేయగా.. గతేడాది గ్రేటర్ హైదరాబాద్ సహా రాష్ట్ర వ్యాప్తంగా 3,307 డిజిటల్ అరెస్ట్ కేసులు నమోదు కావడం గమనార్హం. ఇలాంటి డిజిటల్ అరెస్ట్ మోసాల నుంచి తప్పించుకోవడానికి ప్రజలకు మార్గం వారి చేతుల్లోనే ఉంది.
నిజమైన ప్రభుత్వాలు, చట్టాన్ని అమలు చేసే ఏజెన్సీలు ఫోన్ కాల్స్ ద్వారా డబ్బులు అడగవు, కేసుల విచారించవు అన్న విషయాన్ని గ్రహించాలి. దర్యాప్తు సంస్థల్లో అరెస్ట్‌కు సంబంధించి ఎలాంటి డిజిటల్ ప్రక్రియ ఉండదన్న విషయం తెలుసుకోవాలి. దేశంలో డిజిటల్ అరెస్ట్ స్కామ్‌లు పెరిగిపోతున్నందున ఏదైనా అనుమానం వస్తే 1930కి కాల్ చేయడం లేదంటే సైబర్ క్రైమ్ రిపోర్ట్ పోర్టల్‌లో ఫిర్యాదు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు హెచ్చరిస్తూనే ఉన్నాయి. అయితే తర చూ జరుగుతున్న డిజిటల్ అరెస్ట్ మోసాలపై ప్రజలు కనీస అవగాహన కలిగి ఉండడమే తక్షణ నివారణ మార్గమనేది గుర్తుంచుకోవాలి.






