calender_icon.png 7 September, 2025 | 10:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వర్షాలతో 5 వేల కోట్ల నష్టం

05-09-2025 01:48:50 AM

-రాష్ట్రానికి నిధులు కేటాయించి ఆదుకోండి

-కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకుడిప్యూటీ సీఎం భట్టి, మంత్రి తుమ్మల వినతి 

-త్వరలో కేంద్ర బృందాలను పంపిస్తామని అమిత్‌షా హామీ 

హైదరాబాద్, సెప్టెంబర్ 4 (విజయక్రాంతి): తెలంగాణలో భారీ వర్షాలతో ఆస్తి, పంట నష్టం వాటిల్లిందని, కేంద్రం ఆదుకోవాలని హోంమంత్రి అమిత్‌షాకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విజ్ఞప్తి చేశారు. గురువారం ఢిల్లీలో అమిత్‌షాను కలిసి వినతిపత్రం అందజేశారు.

కామారెడ్డి, మెదక్, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో వరదలు సంభవించి భారీ విధ్వంసంతో మౌలిక సదుపాయాలకు తీవ్ర నష్టం వాటిల్లిందని తెలిపారు. పాథమిక అంచనా మేరకు రూ.5,018.72 కోట్ల నష్టం వాటిల్లిందని చెప్పారు. గత ఏడాది ఖమ్మం, పరిసర జిల్లాల్లో భారీ వర్షాలతో జరిగిన నష్టానికి రూ.11,713 కోట్ల సాయం కోరినా, ఇప్పటివరకు నిధులు విడుదల కాలేదని,  కేవలం సాధారణ నిధులే విడుదలయ్యాయని వివరించారు.

అందువల్ల గతంతో కలిపి మొత్తం రూ.16,732 కోట్లను కేంద్రం తక్షణమే విడుదల చేయాలని విజ్ఞప్తిచేశారు. తమ విజ్ఞప్తికి అమిత్‌షా సానుకూలంగా స్పందించారని, కేంద్ర ప్రభుత్వ అధికారుల బృందాన్ని త్వరలోనే తెలంగాణకు పంపించి అంచనా వేయిస్తామని హామీ ఇచ్చారని భట్టి, తుమ్మల పేర్కొన్నారు.

సమావేశంలో విపత్తు నిర్వహణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌కుమార్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్‌రావు, కేంద్ర ప్రాజెక్టుల సమన్వయ కార్యదర్శి డాక్టర్ గౌరవ్ ఉప్పల్ పాల్గొన్నారు.