28-01-2026 12:00:00 AM
మూడు రోజుల్లోనే నామినేషన్ ఎట్లేసేది?
గందరగోళంలో ఆశావహులు
మహబూబాబాద్, జనవరి 27 (విజయక్రాంతి): మున్సిపల్ ఎన్నికలకు ఎన్నికల కమిషన్ మంగళవారం నోటిఫికేషన్ జారీ చేయడంతో ఒక్కసారిగా రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల కోలాహలం నెలకొంది. అయితే నామినేషన్లకు కేవలం మూడు రోజులు మాత్రమే ఈనెల 28 నుండి 30 వరకు గడువు ఇవ్వడంతో ఎన్నికల్లో పోటీ చేసే ఆశావహులు అయోమయం చెందుతున్నారు.
గిదేందన్న గిట్లయ్యింది.. మూడు రో జుల్లో నామినేషన్ వేసేది ఎట్లా.. పార్టీ టికెట్ ఇస్తుందో.. లేదో ఇంకా స్పష్టం కాలేదు.. ఇప్పటికే రిజర్వేషన్ల తారుమారుతో బలం ఉన్నచోట.. తమ ఓట్లు ఉన్నచోట..పోటీ చేసే అవకాశం కోల్పోయి గందరగోళంలో ఉన్న సమయంలో ఇప్పుడు ఏకా ఎకిన మూడు రోజుల్లోనే నామినేషన్లు వేయడానికి గడువు ఇవ్వడం ఏమిటని వాపోతున్నారు.
చాలా రోజులుగా మున్సిపాలిటీ ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయా అంటూ ఇది చూసిన తమకు ఉన్నటువంటి తక్కువ సమయంలో ఎన్నికల నిర్వహణకు ఉత్తర్వులు రావడంతో తమ పరిస్థితి గందరగోళంగా మారిందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా జనగామ, మహబూబాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లా కేంద్రంలోని మున్సిపాలిటీలతో పాటు పరకాల,
నర్సంపేట, స్టేషన్ ఘనాపూర్, కేసముద్రం, డోర్నకల్, మరిపెడ, తొర్రూరు, వర్ధన్నపేట మున్సిపాలి టీలకు ఎన్నికలు జరగనున్నాయి.
రిజర్వేషన్ల వివరాలు ఇలా ఉన్నాయి
మహబూబాబాద్, ఎస్టీ జనరల్,
కేసముద్రం, ఎస్టీ మహిళ
మరిపెడ, జనరల్ మహిళ
తొర్రూర్, జనరల్
డోర్నకల్, ఎస్సీ జనరల్
పరకాల, జనరల్
వర్ధన్నపేట, జనరల్
భూపాలపల్లి, బీసీ జనరల్
ములుగు, బీసీ మహిళ
నర్సంపేట, బీసీ మహిళ
జనగామ, బీసీ జనరల్
స్టేషన్ ఘనాపూర్ ఎస్సీ జనరల్
మహబూబాబాద్ జిల్లాలో
మున్సిపాలిటీల వారిగా
ఓటర్ల వివరాలు ఇలా ఉన్నాయి.
మహబూబాబాద్ 65,712,
డోర్నకల్ 10,869,
తొర్రూర్ 21,451,
కేసముద్రం 15,945,
మరిపెడ 13,687 ఓటర్లు ఉన్నారు.
మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్
నామినేషన్ల స్వీకరణ నేటి నుండి జనవరి 30 సాయంత్రం ఐదు గంటల వరకు.31న పరిశీలన అనంతరం తుది జాబితా ప్రకటన ఫిబ్రవరి 1న అభ్యంతరాల స్వీకరణ, 2న అప్పిళ్లకు పరిష్కారం 3న నామినేషన్ల ఉపసంహరణ మధ్యాహ్నం 3 గంటల వరకు 11న ఉదయం ఏడు గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు మున్సిపల్ ఎన్నికలకు పోలింగ్ 12న అవసరమైన చోట రీపోలింగ్ 13న ఓట్ల లెక్కింపు, ఎన్నికైన విజేతల ప్రకటన.