calender_icon.png 20 January, 2026 | 1:32 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ముగ్గురి మృతితో కుప్టిలో అలుముకున్న విషాద ఛాయలు

20-01-2026 12:16:39 PM

కుభీర్ లోనూ డ్రైవర్ బొప్ప వికాస్ మృతితో..

రాత్రి భైంసా రోడ్డు ప్రమాదంలో గ్రామంలోని ముగ్గురు దుర్మరణం, సర్పంచ్ గంగాధర్ పరిస్థితి విషమం

ఈ ఘటనలో కుభీర్ కు చెందిన యువ డ్రైవర్ బొప్ప వికాస్ మృతి 

కుభీర్,(విజయక్రాంతి): అరగంటలో ఇంటికి చేరుకుంటాం అని ఫోన్ చేసి ఇంటి వారికి సమాచారం ఇచ్చిన ఐదు నిమిషాల్లోనే ఊహించని సంఘటన తమ వారిని కానరాని లోకాలకు చేరవేసిందంటూ మృతి చెందిన వారిని తలుచుకుంటూ కుప్టి గ్రామంలోని కుటుంబ సభ్యులు బంధువులు రోధిస్తున్న తీరు అందరినీ కలిసి వేస్తోంది. నిర్మల్ జిల్లా కుభీర్ మండలంలోని కుప్టి గ్రామానికి చెందిన ఆరుగురు సోమవారం ఉదయం హైదరాబాద్ లోని హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న బాలుడిని పరామర్శించేందుకని స్థానిక సర్పంచ్ గంగాధర్, ఉప సర్పంచ్ గుండోల్ల లక్ష్మణ్ (చిన్ను)తో పాటు గ్రామానికి చెందిన మరో నల్గురు వెళ్లారు.

తిరిగి సోమవారం రాత్రి అక్కడినుండి బయలుదేరిన వారు మరో అరగంటలో ఇంటికి చేరుకునే లోపు భైంసా సుధ వాగు సాత్ పూల్ వద్ద కంటైనర్ లారీ వీరు ప్రయాణిస్తున్న ఎర్టిగా కారు ఎదురెదురుగా ఢీ కొన్న సంఘటనలో బోయిడి బాబన్న (62), కొడిమెల పెద్ద రాజన్న (70), భోజరాం పటేల్ (40) సంఘటన స్థలంలోనే దుర్మరణం చెందగా సర్పంచ్ గంగాధర్, ఉప సర్పంచ్ చిన్ను ప్రాణాపాయాలతో బయటపడ్డారు.

కుభీర్ కు చెందిన డ్రైవర్ బొప్ప వికాస్ (24)అక్కడికక్కడే దుర్మరణం పాలవడంతో కుభీర్, కుప్టి గ్రామాలలో తీవ్ర విషాదం నెలకొంది. అరగంట సేపట్లో ఇంటికి చేరుకుంటామని ఫోన్లో పలకరించిన తమ వారు అంతలోనే కంటైనర్ లారీ రూపంలో వచ్చిన మృత్యువు కబలించి కానరాని లోకాలకు తీసుకెళ్లి పోయిందంటూ రోదిస్తున్న తీరు గ్రామంలో విషాదఛాయల్ని నింపుతోంది. గ్రామస్తులందరూ ఒకచోట చేరి వారి జ్ఞాపకాలను తలుచుకుంటూ  కంటతడి పెట్టడం అందరిలో దుఃఖాన్ని నింపినట్లయ్యింది.