calender_icon.png 29 October, 2025 | 4:49 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ముచ్చటగా మూడు జీతాలు!

29-10-2025 01:06:19 AM

- వాహన కాంట్రాక్టర్, డ్రైవర్, కార్యాలయ సిబ్బంది ఒక్కరే

- అవుట్ సోర్సింగ్ ఉద్యోగి అయినా పెత్తనం అంత ఆయనదే 

- వత్తాసు పలుకుతున్న ఆహార భద్రత శాఖ అధికారులు

ఖమ్మం, అక్టోబరు 28 (విజయ క్రాంతి): అవసరమైన ఉద్యోగులను ప్రభుత్వం భర్తీ చేయని పక్షంలో ఆయా శాఖలు అవుట్ సో ర్సింగ్ ద్వారా ఉద్యోగులు, సిబ్బందిని నియమించుకుంటాయి. అన్ని క్వాలిఫికేషన్లు అర్హ తలు ఉన్నవారికి కూడా ఈ అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు అంతా సులభంగా రావు. కానీ, ఆహార భద్రత జిల్లా శాఖలో ఓ వ్యక్తి ఏకంగా మూడు రకాలైన విధులు నిర్వహిస్తున్నాడు. అతనికి ఉన్న అర్హతలు ఏ పాటివో, అసలు స్థానికుడు అవునో కాదో సరిగ్గా తెలియకపోయినా సంబంధిత శాఖలో పాగా వేశాడు. 

అదే శాఖకు వాహనాన్ని సమకూర్చిన కాం ట్రాక్టరుగా, అదే వాహనానికి డ్రైవరుగా వి ధులు నిర్వహిస్తూనే, మరోవైపు శాంపిల్ సేకరణ స్థాయి సిబ్బంది గా వ్యవహరిస్తున్నాడు. ఇదంతా బాహాటంగానే జరుగుతుందంటే, సదరు సిబ్బందికి సంబంధిత శాఖ జిల్లా స్థాయి అధికారులు ఏ స్థాయిలో వత్తాసు ప లుకుతున్నారో అర్థమవుతోంది.  మొత్తానికి సదరు సిబ్బంది మరో ఇద్దరి ఉపాధి అవకాశానికి గండి కొట్టడమే కాకుండా, మొత్తం జీతాన్ని తానొక్కడే జేబులో వేసుకుంటున్నాడన్న విమర్శలు అనిపిస్తున్నాయి. 

అసలు స్థానికుడేనా..?

జిల్లాలోని ఆయా ప్రభుత్వ శాఖలు అవుట్సోర్సింగ్ ద్వారా ఉద్యోగులను తీసుకునే సమయంలో స్థానికులకు మొదటి ప్రాధా న్యం ఇస్తారు. సదరు ఉద్యోగానికి సరైన అర్హతలు కలిగిన వ్యక్తులు లేనప్పుడు మాత్రమే ఇతర జిల్లాల నుంచి అర్హత కలిగిన వ్యక్తులను తీసుకోవచ్చు. కానీ ఆహార భద్రత శాఖ కార్యాలయంలో శాంపిల్ సేకరణ స్థాయి ఉ ద్యోగి ఇతర జిల్లాకు చెందిన వాడని, స్థానికంగా నివాసం ఉంటున్నట్లు ఆధార్ కార్డు సృష్టించి ఉద్యోగంలో చేరాడని తెలుస్తోంది.

సదరు సిబ్బంది మొదట సంబంధిత శాఖ లో సంవత్సరంన్నర కిందటి వరకు స్వీపర్ స్థాయి సిబ్బందిగా పనిచేసేవాడు. గతేడాది శాంపిల్ సేకరణ స్థాయి ఉద్యోగానికి అవుట్ సోర్సింగ్ సిబ్బంది గా మారినట్లు సమాచా రం. నిబంధన ప్రకారం స్థానిక జిల్లా వారికే అవుట్ సోర్సింగ్ ఉద్యోగం ఇవ్వాల్సి ఉం టుంది.  తాను ఇతర జిల్లాకు చెందిన వాడు కాబట్టి ఈ అవుట్ సోర్సింగ్ ఉద్యోగానికి అ నర్హుడు. దీంతో తన తెలివిని ఉపయోగించి స్థానికంగా ఆధార్ కార్డు సంపాదించాడు. ఈ విషయం మొత్తం సంబంధిత శాఖ జిల్లా అధికారులకి పూర్తిగా తెలుసనే అభిప్రాయం వినిపిస్తోంది. ఈ ఉద్యోగానికి కుదురుకున్న తర్వాత,  తాను పనిచేస్తున్న శాఖకు వాహ నం అవసరమనే విషయం తెలుసుకున్నాడు ఇంకేముంది వాహన కాంట్రాక్టర్ అవతారం ఎత్తాడు.

ఇక వాహనానికి డ్రైవరును నియమిస్తే అందుకు తగ్గ జీతం అందించాల్సి ఉంటుంది. దీనివల్ల తనకి మిగిలేది ఏమీ ఉండదని అనుకున్నాడో ఏమో,  తానే డ్రైవరుగా కుదురుకున్నాడు. మొత్తానికి అటు వా హనానికి కాంట్రాక్టర్ గా అదే వాహనానికి డ్రైవర్గా శాంపిల్ సేకరణ స్థాయి సిబ్బంది ఉద్యోగిగా చలామణి అవుతూ, మూడు ర కాల జీతాలను తన ఖాతాలో వేసుకుంటున్నాడు. ఈ వ్యవహారం మొత్తం సంబంధిత శాఖ అధికారులకు పూర్తిగా తెలిసే జరుగుతోందని, సదరు సిబ్బందికి, సంబంధిత శాఖ అధికారులకు మధ్య లావాదేవీలు నడవకపోతే ఈ స్థాయి తతంగం జరగదనే అభిప్రాయం వినిపిస్తోంది.   

వారిద్దరి అండతోనేనా..!

సంబంధిత శాఖ జిల్లా స్థాయి అధికారులు కిందిస్థాయి అధికారులు ఉద్యోగులు నిత్యం తనిఖీలకు వెళ్లాల్సి ఉంటుంది. ఈ స మయంలో శాంపిల్ సేకరణ స్థాయి సిబ్బం ది కూడా వెళ్లి శాంపిల్ సేకరణ చేయాల్సి ఉంటుంది. ఏదైనా దుకాణానికి వెళ్ళినప్పు డు కిందిస్థాయి అధికారులు శాంపిల్ సేకరణ చేయాలని సదరు సిబ్బందిని ఆదేశిస్తే తాను చేయనని మొండికేస్తాడని తెలుస్తోం ది. ఆయా దుకాణాలు, రెస్టారెంట్లు, హాస్టళ్ల నుంచి మామూలు వసూలు చేసి పై అధికారులకు సమర్పించే పనులు చేస్తుంటాడని, అందుకే కిందిస్థాయి అధికారులు, ఉద్యోగులకు ఎదురు చెబుతుంటాడనే విమర్శలు ఉ న్నాయి. ఏళ్లుగా సంబంధిత శాఖలో పని చే స్తుండడంతో పాటు ఇక్కడ జరిగే వ్యవహారాలన్నీ పూర్తిగా తెలుసు.

ఎప్పుడు, ఎక్కడ, ఎవరి నుంచి ఎంత తీసుకురావాలనే వాటి లో బాగా ఆరి తేరిపోయాడు. ఇలా వచ్చిన వాటిని జిల్లా స్థాయి అధికారి ఆపై జోనల్ స్థాయి అధికారికి కూడా పంపిస్తుంటాడని స మాచారం. వీరిద్దరి అండదండలు తనకు పు ష్కలంగా ఉన్నాయి కాబట్టి ఎవరూ తనను ఏమీ చేయలేరని ధైర్యంతో ఇలా వ్యవహరిస్తుంటాడని, సంబంధిత శాఖ ఉద్యోగులే కొ న్ని సందర్భాల్లో తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. పై స్థాయి అధికారుల అండదండలతో శాఖలో మిగతా ఉద్యోగు లు సిబ్బంది పైనే కాకుండా, వారిపై కొన్ని సందర్భాల్లో అధికారులను సైతం లెక్కచేయడని తెలుస్తోంది. 

నియమ నిబంధనలు తెలియవట

ఏదైనా ప్రభుత్వ శాఖకు ప్రైవేటు వాహనాన్ని సమకూర్చేందుకు అదే శాఖలో పని చేస్తున్న ఉద్యోగులు, సిబ్బంది అనర్హులు. ఇ ది గమనించిన సదరు సిబ్బంది తన తెలివితేటలు ఉపయోగించి వాహనాన్ని తనకు చెందిన వారి పేరిట కాంట్రాక్టు కుదిర్చాడు. సాధారణంగా కాంట్రాక్టు కుదుర్చుకున్న వ్యక్తి, వాహనానికి డ్రైవరును నియమించడంతో పాటు వాహనానికి అయ్యే ఖర్చులు అన్నీ భరించాల్సి ఉంటుంది. ఈ విషయం సంబంధిత శాఖ అధికారులకు కూడా తెలు సు. దీని గురించి బయటి వారు ఎవరైనా ప్రశ్నిస్తే, సంబంధిత శాఖ అధికారులు అంత ఎత్తున విరుచుకు పడుతున్నట్లు తెలుస్తోంది.

శాఖకు అవసరమైన వాహనాన్ని కాంట్రాక్టర్ ద్వారా కుదుర్చుకున్నామని, సదరు కాంట్రాక్టర్ డ్రైవరును నియమించకపోవడంతో త మ శాఖలోని శాంపిల్స్ సేకరణ స్థాయి సి బ్బందిని తాత్కాలిక డ్రైవరుగా ఉపయోగించుకుంటున్నామని, ఇందులో తప్పేముంద ని ఎదురు ప్రశ్నిస్తున్నారు. కాంట్రాక్టు కుదుర్చుకునేటప్పుడు విధి విధానాలు ఉంటాయి కదా డ్రైవర్ను కాంట్రాక్టర్ ఎందుకు నియమించలేదని ఎవరైనా ప్రశ్నిస్తే ‘వాహన కాం ట్రాక్టు విషయానికి సంబంధించిన నియమ నిబంధనలు మాకు ఏమీ తెలియవు. మీకు తెలిస్తే చూపించండి’ అంటూ ఎదురుదాడికి దిగటం పరిటయిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

పైగా తాము ఉపయోగిస్తున్న వాహ నానికి లక్షల కొద్ది బకాయిలు ప్రభుత్వం నుంచి రావాల్సి ఉందని, ఇలాంటి సమయంలో సదరు కాంట్రాక్టరును డ్రైవరు కో సం సతాయించి, మరింత భారం మోపలేమని సంబంధిత శాఖ అధికారులు సదరు జాలి వచనాలు పలుకుతున్నారు. ప్రభుత్వ అధికారులైన వారే, బిల్లులు చెల్లించకపోవడం ప్రభుత్వానిదే తప్పనేలా మాట్లాడు తూ, తమ సిబ్బందిని వెనకేసుకు వచ్చే ప్ర యత్నం చేస్తున్నారు. దీనిని బట్టి సదరు సిబ్బంది వాహన కాంట్రాక్టు వ్యవహారం అంతా సంబంధిత శాఖ అధికారులకు తెలి సే జరుగుతోందన్న విమర్శలకు బలం చేకూరినట్లవుతోంది.

విషయం ఆరా తీసి చెబుతాం 

 మేము ఉపయోగిస్తున్న వాహనానికి ప్రస్తుతం డ్రైవర్ అంటూ ఎవరూ లేరు. తనిఖీలకు ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో మా సిబ్బందిని తీసుకు వెళుతున్నాం.  డ్రైవరును నియమించే విష యమై కాంట్రాక్టర్ ని ఆరా తీయడంతో పాటు, వెంటనే డ్రైవరును నియమించాలని చెబుతాం

కిరణ్ కుమార్, గెజిటెడ్ ఫుడ్ ఇన్ స్పెక్టర్, ఖమ్మం.