15-12-2025 08:34:13 PM
జిల్లా ఎస్పీ నితిక పంత్
పోలింగ్ కేంద్రాల పరిసర ప్రాంతాల్లో 163 బి.ఎన్.ఎస్.ఎస్ అమలు
ఎన్నికల ఫలితాల అనంతరం విజయోత్సవ ర్యాలీలకు అనుమతి నీల్
ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు
కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): జిల్లాలో మొదటి, రెండవ విడత స్థానిక సంస్థల ఎన్నికలు శాంతియుతంగా , నిష్పక్షపాతంగా నిర్వహించడంలో జిల్లా పోలీస్, ఇతర శాఖల అధికారులు , సిబ్బంది పాత్ర కీలకమైందని జిల్లా ఎస్పీ నితిక పంత్ తెలిపారు. మూడవ విడత ఎన్నికలలో భాగంగా ఈ నెల 17 న ఆసిఫాబాద్, రెబ్బెన, తిర్యాని, కాగజ్ నగర్ మండలాల పరిధిలో 108 సర్పంచ్ స్థానాలు, 938 వార్డు మెంబర్ స్థానాలకు నిర్వహించే ఎన్నికలకు పోలీస్ బందోబస్త్ సంసిద్దమని ఎస్పీ తెలిపారు. అభ్యర్థులు, రాజకీయ పార్టీలు, ప్రజలు ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఖచ్చితంగా పాటించాలని సూచించారు.
సైలెంట్ పీరియడ్ అమలు పోలింగ్‌కు 48 గంటల ముందు నుండి, అనగా సోమవారం సాయంత్రం 5:00 గంటల నుంచి బుధవారం వరకు, సైలెంట్ పీరియడ్ అమల్లో ఉంటుందని ఎస్పీ తెలిపారు. ఈ సమయంలో ఎన్నికల సభలు, సమావేశాలు, ఇంటింటా ప్రచారం, లౌడ్‌స్పీకర్ వినియోగం, ర్యాలీలు, బైక్ ర్యాలీలు పూర్తిగా నిషేధం అని అన్నారు. ఎన్నికలు శాంతియుతంగా నిర్వహించేందుకు పోలింగ్ కేంద్రాల వద్ద ప్రత్యేక పహార, నిఘా బృందాలు, ఏరియా డామినేషన్ పార్టీలు, రూట్ మొబైల్, స్ట్రైకింగ్ ఫోర్స్ తో కట్టుదిట్టమైన భద్రత చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. రెండో విడత ఎన్నికల కోసం 611 మంది పోలీసు అధికారులు, సిబ్బంది, 184 మంది ఇతర శాఖల సిబ్బంది( ఫారెస్ట్, సింగరేణి, ఎక్సైజ్, ట్రాన్స్ కో, ఎ.సి.బి శాఖలు ) మొత్తం 795 మందిని నియమించి పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ తెలిపారు.
సోమవారం సాయంత్రం 5 గంటల నుండి ఎన్నికలు పూర్తయ్య వరకు జిల్లాలో 163 బి.ఎన్.ఎస్.ఎస్ (144 సెక్షన్ ) అమల్లో ఉంటుందని, ఎన్నికల కేంద్రాల పరిసరాల్లో 100 మీటర్ల పరిధిలో ఐదుగురు లేదా ఆ పైగా వ్యకులు గుంపులు గుమికూడరాదు. అభ్యర్థులు, పార్టీ కార్యకర్తలు అక్కడ సమూహాలుగా ఉండకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు.పోలింగ్‌కు 48 గంటల ముందు నుండి ఏ విధమైన ప్రచార కార్యక్రమాలు, ర్యాలీలు, సమావేశాలు నిర్వహించడం పూర్తిగా నిషేధం. ఎన్నికల ఫలితాలు అనంతరం ఎలాంటి విజయోత్సవ ర్యాలీలకు, బైక్ ర్యాలీలకు, అనుమతి లేదని, మూడో విడత ఎన్నికలు పూర్తయిన అనంతరం సంబంధిత అధికారులు నిర్దేశించిన తేదీలలో మాత్రమే విజయోత్సవ సంబరాలు నిర్వహించుకోవచ్చు అని తెలిపారు.ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిష్పక్షపాతంగా జరిగేందుకు ప్రజలు పోలీసులకు పూర్తి సహకారం అందించాలని, ఏవైనా అనుమానాస్పద వ్యక్తులు లేదా సంఘటనలు కనిపించిన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఎస్పీ కోరారు.