calender_icon.png 15 December, 2025 | 11:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మద్యం సేవించి వాహనం నడపడం మీకు, మీ కుటుంబానికి క్షేమం కాదు

15-12-2025 08:49:39 PM

వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ సన్‌ ప్రీత్‌ సింగ్‌

హనుమకొండ (విజయక్రాంతి): వాహనదారులు మద్యం సేవించి వాహనం నడపటం ద్వారా మీకు, మీ కుటుంబానికి క్షేమకరం కాదని వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ సన్‌ ప్రీత్‌ సింగ్‌ హితవు చేసారు. మద్యం సేవించి వాహనం నడపటం ద్వారా జరిగే రోడ్డు ప్రమాదాలతో పాటు, ఈ ప్రమాదాల కారణంగా  ఇరువైపు కుటుంబాలు రోడ్డున పడటమే కాకుండా రోడ్డు ప్రమాదాల కారణంగా క్షతగాత్రులుగా మారటంతో కాదు, మరి కొద్దిమంది అంగవైకల్యంతో ఎంతో మంది వాహనదారులు, సాధరణ ప్రజలు జీవన పోరాటం చేస్తున్నారని పోలీస్‌ కమికషనర్‌ వెల్లడించారు.

ఇలాంటి రోడ్డు ప్రమాదాల నివారణకై వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో ప్రత్యేక చర్యలు తీసుకొబడుతోందని, ఇందుకోసం వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో అన్ని పోలీస్‌ స్టేషన్ల లో ప్రత్యేక డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ తనిఖీలు చేపట్టడం జరుగుతోందని, ఈ తనిఖీల్లో పట్టుబడిన వాహనదారులపై కేసులు నమోదు చేయడంతో పాటు వారిని కోర్టులో హాజరు పర్చడం ద్వారా న్యాయమూర్తి వారికి జైలు శిక్ష లేదా జరిమాన విధించబడుతోందని, రోడ్డు ప్రమాదాల నివారణకై తీసుకుంటున్న చర్యల్లో భాగంగా పోలీసులు గత వారం ట్రై సిటి పరిదిలో నిర్వహించిన డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ తనిఖీల్లో నమోదైన మొత్తం 437 కేసుల్లో కోర్టు 1,58,200, రూపాయల జరిమానా విధించబడగా, 24 మందికి జైలు శిక్ష విధించడం జరిగింది.

ఇందులో వరంగల్‌ ట్రాఫిక్‌ పరిధిలో నమోదైన 158 కేసుల్లో 14 మంది జైలు శిక్ష విధించగా, 72,900. రూపాయలు జరిమానా విధించడం జరిగింది. ఇదే విధంగా కాజీపేట పరిధిలో 142 కేసుల్లో 9మందికి జైలు శిక్ష, మిగితా కేసుల్లో 79,500, జరిమానా, హన్మకొండ ట్రాఫిక్‌ పరిధిలో 137 కేసులకు గాను 5,800, జరిమానాతో పాటు  ఒక్కరి మాత్రమే  జైలు శిక్ష విధించడం జరిగిందని వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ వెల్లడించారు. ఇకనైనా వాహనదారులు తమ కుటుంబాలను దృష్టిలో వుంచుకోని  మద్యం సేవించి వాహనం నడపోద్దని, ఇలాంటి చర్యలకు పాల్పడితే జైలు జీవితం తప్పదని పోలీస్‌ కమిషనర్‌ వాహనదారులను హెచ్చరించారు.