15-12-2025 09:28:37 PM
ఘట్ కేసర్ (విజయక్రాంతి): జీహెచ్ఎంసీ పోచారం సర్కిల్ కొర్రెముల సుప్రభాత్ టౌన్ షిప్ కమ్యూనిటీ హాల్ లో సింగరేణి రిటైర్డ్ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం డిడిఎచ్ రెనోవా క్యాన్సర్ సెంటర్ వారు రిటైర్డ్ ఉద్యోగ కుటుంబాలకు ఇతర ప్రజలకు క్యాన్సర్ వ్యాధిపై అవగాహన కొరకు హెల్త్ టాక్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సింగరేణి రిటైర్డ్ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఉప ప్రధాన కార్యదర్శి ఆళవందార్ వేణుమాధవ్ మాట్లాడుతూ ప్రపంచంలో గుండెపోటు తరువాత ఎక్కువ మంది ప్రజలు క్యాన్సర్ వ్యాధితో మరణిస్తున్నారని, ఆస్ట్రేలియా దేశంలో ఈ వ్యాధి ఎక్కువగా ఉందని, క్యాన్సర్ వ్యాధి బారిన పడకుండా జీవన శైలి, ఆహార అలవాట్లు మార్చుకొని, పొగాకు, ఆల్కహాల్ సేవించడం మానుకోవాలని, ముందుగా గుర్తిస్తే నిర్మూలించవచ్చన్నారు.
ప్రముఖ క్యాన్సర్ వ్యాధి నిపుణులు డాక్టర్ బి. మధుసూదన్ రావు మాట్లాడుతూ ప్రజలు క్యాన్సర్ వ్యాధిలో ఎన్ని రకాలు, లక్షణాలు, ముందస్తుగా ఏవిధంగా పరీక్షించవచ్చో నివారణ చర్యలు గురించి వివరించారు. డిడిఎచ్ రెనోవా క్యాన్సర్ సెంటర్ యూనిట్ హెడ్ కె. శ్రీవల్లి మాట్లాడుతూ విద్యానగర్ హైదరాబాద్ లో ఉన్న వారి హాస్పిటల్ లో ఉచిత పరీక్షలతో పాటు తక్కువ ధరలో వైద్యం అందింస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సింగరేణి రిటైర్డ్ ఉద్యోగులు వారి కుటుంబ సభ్యులు కొట్టే మల్లయ్య, సత్యనారాయణ, ఎం. రాజా నర్సు, చుక్కల నర్సయ్య, జి.వి. రాజిరెడ్డి, జి. కనకయ్య, వెంకటస్వామి, రామరాజు, ఎ. ప్రభాకర్, రఫిక్, ప్రతాప్ సింగ్, వెంకటాద్రి టౌన్ షిప్ ఫేస్ వన్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు వినోద్, శరబయ్య, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.