17-08-2025 12:00:00 AM
భారత అంతరిక్ష వారోత్సవాల సందర్భంగా
భారత అంతరిక్ష పితామహుడు డాక్టర్ విక్రమ్ సారాభాయ్ జన్మదినం పురస్కరించుకొని ఆగస్టు 12 నుంచి 18 వరకు దేశవ్యాప్తంగా ‘భారత అంతరిక్ష వారోత్సవాలు’ నిర్వహించడం ప్రతి ఏటా ఆనవాయితీ. 2025 భారత అంతరిక్ష వారేత్సవాలకు ఇతివృత్తంగా ‘అంతరిక్ష విజ్ఞానం ఆవిష్కరణలు 2025’ అనే అంశంతో పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
అంతరిక్ష శాస్త్రం, ఆవిష్కరణలు, ఉపగ్రహాల విజయవంతమైన ప్రయోగాలు, వివిధ గ్రహాలకు భారతీయ వ్యోమగాములను లేదా ‘వ్యోమొనాట్స్’ను పంపించడం, ప్రజాహిత పరిశోధనలు కొనసాగించడం, యువతలో అంతరిక్ష ప్రయోగాల్లో అవగాహన కల్పిస్తూ వారిని అంతరిక్ష రంగంలోకి ఆకర్షించడం, అంతరిక్ష టెక్నాలజీ వైపు యువతను ఆకర్షించ డం, దేశ అంతరిక్ష ప్రతిభను ప్రపంచ దేశాల ముందు సగర్వంగా నిలప డం, పలు రకాల అంతరిక్ష సంబంధ అంశాల్లో పోటీలు నిర్వహించడం లాంటి కార్యక్రమాలను వారం రోజుల పాటు నిర్వహిస్తున్నారు.
1963లో తొలి భారత అంతరిక్ష ప్రయోగంగా రాకెట్ లాంచ్‌ను తుంబా అంతరిక్ష కేంద్రం, కేరళ నుంచి తొలి రాకెట్ ప్రయోగించడంతో అంతరిక్ష రంగంలో కార్యక్రమాలకు బీజాలు పడ్డాయి. 1980,-90ల్లో ఎస్‌ఎల్‌వి, ఇన్సాట్ శ్రేణి శాటిలైట్ లాంచింగ్ వెహకిల్స్ ప్రయోగించడంతో దేశ కమ్యూనికేషన్స్, వాతావరణ హెచ్చరికలు, నీటి వనరుల అన్వేషణలు లాంటి ప్రయోగ ఫలితాలతో దేశంలో వ్యవసాయం, నీటి వనరుల అభివృద్ధి, విపత్తు నివారణ అంశాలకు మార్గం సుగమం అయ్యింది.
2017లో ఒకే పీఎస్‌ఎల్వీసీ-37 ప్రయోగంలో 104 ఉపగ్రహాలను అంతరిక్ష కక్షలో విజయవంతంగా చేర్చి ఇస్రో చరిత్ర సృష్టించింది. 2008లో చంద్రయాన్- చంద్రుడిపై నీటి ఉనికిని నిర్థారించడం, 2014లో మంగళ్‌యాన్ ద్వారా ‘మార్స్’కు చేరడం, 2023లో చంద్రయాన్-3 ప్రయోగంతో చంద్రుడిపై ప్రయోగాలు చేయ డం మనం సాధించిన విజయాలు. నేటి భారతీయ యువశక్తిని అంతరిక్ష రంగం వైపుకు ఆకర్షించాలనే ఏకైక లక్ష్యంతో ఈ వారోత్సవాలు నిర్వహిస్తున్నారు.
నేటి పాఠశాల, కళాశాలల యువతను ‘స్టెమ్’ రంగం వైపు ఆకర్షించి అంతరిక్ష రంగానికి మరింత ఊపును తేవాలని ఇస్రో కలలు కంటుంది. భారత అంతరిక్ష వారోత్సవాల్లో భాగంగా వెయ్యి కన్నా ఎక్కువ విద్యా సంస్థల్లో వ్యాస రచన, వక్తృత్వం, పేయింటింగ్, డ్రాయింగ్, కలరింగ్, అంతరిక్ష డ్రెస్‌ల వేషధారణ, స్పేస్ సూట్ ఫ్యాషన్ షోలు, ఇస్రో వ్యవస్థాపక దినం, స్పేస్ టెక్నాలజీ లాంటి అంశాల్లో పలు పోటీలను నిర్వహిస్తున్నారు.
వివిధ ఉన్నత విద్యా సంస్థల్లో అంతరిక్ష విద్యను ప్రారంభించడంతో పాటు యువతను ఆకర్షించి రేపటి అద్భుత అంతరిక్ష పరిశోధకులుగా తయారు చేయడం గమనిస్తున్నాం. నేటి యువభారతం రేపటి అంతరిక్ష శాస్త్రవేత్తలుగా రూపాంతరం చెందాలని ఆశిద్దాం.
డాక్టర్ బుర్ర మధుసూదన్ రెడ్డి