17-08-2025 12:00:00 AM
గబ్బర్, ఠాకూర్, జయ్, వీరూ ఎవరో తెలుసా.. పోనీ బసంతీ ఎవరు? ఎందుకు తెలియదు.. ఇవి దేశాన్ని ఓ ఊపు ఊపిన షోలే సినిమాలోని పాత్రలు ఎవరైనా చెప్పొచ్చు. ఈ ఏడాది 79వ స్వాతంత్య్ర వేడుకల్ని జరుపుకున్న పంద్రాగస్టు రోజే దేశమంతా షోలే సినిమా గురించి మననం చేసుకొంది. సినిమా ప్రియులు మాట్లాడుకున్నారు. పంద్రాగస్టు రోజునే షోలే విడుదలై 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా, పంద్రాగస్టులో ఓ పోస్టల్ కవర్ తీసుకొచ్చారు.
షోలే చిత్ర దర్శకుడు రమేశ్ సిప్పీ దానిని ఆవిష్కరించారు. అంతేకాదు ఫిల్మ్ హెరిటేజ్ ఫౌండేషన్ సోషల్ మీడియాలో ఓ వార్తను పంచుకుంది. సెప్టెంబర్ 6న టొరంటో అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో షోలే సినిమాను ప్రదర్శిస్తున్నారని, అందునా ఆ చిత్రం ఒరిజినల్ ముగింపులో ఆ ప్రదర్శన ఉం టుందని కొంత మసాలా అద్ది వార్తనందించింది. ఇన్నేళ్ల షోలే సినిమా లో అందరూ చూసిన మగింపు ఓ అతుకు.
సెన్సార్ బోర్డు అభ్యంతరం మేరకు ఓరిజనల్ ముగింపును చిత్ర నిర్మాతలు మార్చాల్సి వచ్చింది. చేతుల్లేని పోలీసు ఆఫీసర్ ఠాకూర్, గబ్బర్‌సింగ్‌ను చంపేయడమే ఆ చిత్రం ఒరిజనల్ మగింపు. 1975లో, కొద్ది రోజుల్లో దేశంలో ఎమర్జెన్సీ వస్తుందనగా, ఓ పోలీస్ ఆఫీసర్ చట్టాన్ని తన చేతిలోకి తీసుకొని విలన్‌ను చంపేస్తే ప్రభుత్వం ఏమనుకుటుందని సెన్సార్ బోర్డు అభ్యంతరం చెప్పిందట. ఒక్క టొరంటో చిత్రోత్సవంలోనే ఇప్పుడు చిత్రం ఒరిజనల్ ముగింపును అక్కడి ప్రేక్షకులు చూడబోతున్నారు.
ఇక, షోలే చిత్ర విశేషాలు అన్నీ ఇన్నీ కావు. చిత్ర నిర్మాణం గురించి అనే పుస్తకాలు, వ్యాసాలు వచ్చాయి. ఒక సినమాను కోట్ల సంఖ్యలో ప్రేక్షకులు చూడటం, అనేక థియేటర్లలో నెలల తరబడి ఆడటం వంటి విశేషాలకు కొదువలేదు. గబ్బర్‌సింగ్‌గా అమ్జద్‌ఖాన్ భారతీయ చలనచిత్ర విలన్‌కు కొత్త గ్రామర్ రాసినట్లయింది. ‘అరె వో సాంబా, కిత్తి గోలీరే’ వంటి డైలాగులు సలీం అలవోకగా గబ్బర్‌కు అందిచినట్లు కనిపిస్తుంది.
సంజీవ్ కుమార్, ధర్మేంద్ర, అమితాబ్ బచ్చన్, హేమమాలిని, జయబాధురి, ఆస్రానీల నటన గురించి చెప్పాల్సిన పనిలేదు. బందిపోట్లతో నలిగిపోయే చంబల్‌లోయ గ్రామాలను, గబ్బర్ ఉండే డెన్‌ను.. కర్ణాటకలోని రామనగర కొండల్లో చిత్రీకరించారనేది అప్పట్లో ఓ ఆశ్చర్యం. రామనగర ఆ తర్వాత టూరిస్టు స్పాట్‌గా మారింది. ప్రభావిత జపాన్ దర్శకుడు అకిరా కురొసావా చిత్రం ‘సెవెన్ సమురాయ్’ కథను మాతృకగా తీసుకొని షోలే నిర్మించారు.
ఆ చిత్రంలో గ్రామీణులు ఏడుగురు సమురాయ్‌లను బందిపోట్లను ఎదుర్కొనేందుకు ఒప్పందం కుదుర్చుకుంటే, షోలే సినిమాలో ఇద్దరు సాహసవంతులైన యువకులైన జై, వీరులను.. ఠాకూర్ ఒప్పించి రామ్‌గఢ్ గ్రామానికి తీసుకువస్తాడు.
గ్రామీణ వాతావరణం, పాత్రలు, వారి సంభాషణలు, ప్రేమ సన్నివేశాలు, ఫైట్లు, ఉత్కంఠ రేకెత్తించే సన్నివేశాలు, విషాదాలతో సగటు ప్రేక్షకులను కట్టిపడేసిన షోలే ఇటు భారతీయ సినిమా, వెస్ట్రన్ సినిమా కలగలుపుకొని ఇన్నేళ్లు ఒక అద్భుతంగా నిలిచిపోయింది. భారతీయ సినీ చరిత్రలో విశేష అభిమానాన్ని సంపాదించిన చిత్రంగా ‘షోలే’ నిలిచింది. ఎన్నేండ్లయినా ‘షోలే’ చిత్రం ఎప్పటికీ అజరామరమైన చిత్రంగా నిలిచిపోతుందనడంలో సందేహం లేదు.