16-08-2025 12:00:00 AM
శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్
కుమ్రం భీం ఆసిఫాబాద్, ఆగస్టు 15(విజయ క్రాంతి): ఎంతమంది త్యాగదనుల ఫలితమే నేడు స్వేచ్ఛగా జీవిస్తున్నామని శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్ అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ లో నిర్వహించిన 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే, జిల్లా అదనపు కలెక్టర్లు దీపక్ తివారి, డేవిడ్, సబ్ కలెక్టర్ శ్రద్ధ శుక్ల, జిల్లా ఎస్పీ కాంతిలాల్ పాటిల్, జిల్లా అటవీ శాఖ అధికారి నీరజ్ కుమార్, ఎమ్మెల్యేలు కోవలక్ష్మి, పాల్వాయి హరీష్ బాబు, ఎఫ్డిఓ సుశాంత్ సుఖదేవ్ లు హాజరు కాగా ముందుగా అమరవీరుల స్తూపం వద్ద నివాళులు అర్పించి పోలీసుల గౌరవ వందనం స్వీకరించి జాతీయ జెండా ఆవిష్కరించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ర్టంలోని పేదల సంక్షేమం ప్రజా ప్రభుత్వ లక్ష్యమని పునరుద్ఘాటించారు. పేదలకు సన్నబియ్యం ఇవ్వడమే కాకుండా జులై 14 నుండి రేషన్ కార్డులు అందిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో 54,205 దరఖాస్తుల రాగా 48028 రేషన్ కార్డులు ఇచ్చినట్లు తెలిపారు. మిగిలిన 6177 దరఖాస్తులు పరిశీలనలో ఉన్నట్లు వివరించారు. గత సంవత్సరం ఆగస్టు 15న రుణమాఫీకి శ్రీకారం చుట్టామని రాష్ర్ట ఆర్థిక పరిస్థితి బాగా లేకపోయినప్పటికీ రాష్ర్టంలో 20వేల కోట్లు రుణమాఫీకి కేటాయించడం రాష్ర్ట చరిత్రలోనే గొప్ప విషయం అన్నారు.
జిల్లాలో 51523 మంది రైతులు లబ్ది పొందారని వీరి ఖాతాలో 465 కోట్లు అందించినట్లు తెలిపారు. ఎన్నికలు ఇచ్చిన హామీ మేరకు రైతు భరోసా 12 వేలకు పెంచామని జిల్లాలో 1,33,306 మంది రైతులకు ఖాతాలో 251 కోట్లు జమ చేసినట్లు తెలిపారు. సన్న వడ్లకు క్వింటాలకు 500 బోనస్ చెల్లించినట్లు తెలిపారు. గత 18 నెలల్లో అన్నదాతల సంక్షేమం కోసం లక్ష 13 వేల కోట్లు ఖర్చు చేసినట్లు వివరించారు. పేదలకు ఇండ్లు నిర్మించే ఉద్దేశంతో ఇందిరమ్మ ఇండ్ల పథకం ప్రవేశపెట్టామని దీంట్లో భాగంగా జిల్లాకు 7398 ఇల్లు మంజూరు చేసినట్లు తెలిపారు.
గిరిజనుల సంక్షేమం కోసం వారి సాగు భూములకు సాగునీరు విద్యుత్ సౌకర్యం ఇచ్చేందుకు “ఇందిరా సౌర గిరిజల వికాస పథకం” ప్రారంభించినట్లు తెలిపారు. బీసీలకు గత ప్రభుత్వాలు హామీ ఇచ్చి మోసం చేశాయని తాము 42% రిజర్వేషన్ కల్పించే దిశగా శాసనసభలో బిల్లు ప్రవేశపెట్టి ఆమోదింపచేశామని గుర్తు చేశారు. ఎస్సీల వర్గీకరణ కూడా సుప్రీంకోర్టు తీర్పుకు లోబడి పూర్తి చేశామన్నారు.
రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద 126 రకాల చికిత్సలకు మందులు అందించడం జరుగుతుందని, ఈ పథకం ద్వారా జిల్లాలో 11997 మంది లబ్ధి పొందుతున్నట్లు తెలిపారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన 48 గంటల్లో తెలంగాణ ఆడపడుచులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం మహాలక్ష్మి పథకం అమలు చేశామని జిల్లాలో కోటి 68 లక్షలు మంది దీనిని వినియోగించుకున్నట్లు వివరించారు. పట్టణ ప్రాంతాలకు దీటుగా గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కోసం చేపట్టిన రూర్బన్ పథకంలో భాగంగా చిర్రకుంట క్లస్టర్ లో 15 కోట్ల వ్యయంతో చేపట్టిన అభివృద్ధి పనులతో జాతీయస్థాయిలో 25 స్థానంలో నిలిచిందన్నారు.
గడిచిన 18 నెలలో జిల్లాలోని అంగన్వాడీలలో గర్భిణీలకు బాలింతలకు ఒకపూట సంపూర్ణ భోజనం అందిస్తున్నట్లు తెలిపారు. వికలాంగుల సంక్షేమ కోసం ఆర్థిక ప్రోత్సాహక పథకం కింద 350 మందికి ఉపకరణాలు అందించామన్నారు. వివిధ పాఠశాలల్లో చెందిన విద్యార్థులు చేసిన నృత్యాలు అందర్నీ ఆకట్టుకున్నాయి.ఉత్తమ ఉద్యోగులకు ప్రశంస పత్రాలను అందజేశారు.ఈ కార్యక్రమంలో ఆర్డీవో లోకేశ్వరరావు,డి ఆర్ డి ఓ దత్తారావు డీఏవో శ్రీనివాసరావు,అధికారులు,నాయకులు, సిబ్బంది పాల్గొన్నారు.