16-08-2025 04:14:59 PM
పర్యాటకులతో పోటెత్తిన ప్రాంతం..
సుందర దృశ్యాలను చూసేందుకు తరలివస్తున్న పర్యాటకులు..
ఏపీ.. తెలంగాణ ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో పర్యాటకులు..
ఈరోజు శనివారం కావడంతో హైదరాబాద్ నుండి సందర్శకులు..
నాగార్జునసాగర్ (విజయక్రాంతి): నాగార్జున సాగర్(Nagarjuna Sagar Dam)కు శనివారం పర్యాటకులు పోటెత్తారు. గత వారం రోజులుగా సాగర్ అందాలను చూసేందుకు పర్యాటకులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. 16 గేట్ల ద్వారా కిందికి దూకుతున్న నీటి పరవళ్లను చూసేందుకు జనం క్యూ కడుతున్నారు. దీంతో సాగర్ దగ్గర కిలోమీటర్‌కు పైగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. నాగార్జునసాగర్ డ్యామ్ 16 క్రస్ట్ గేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల చేస్తుండడంతో కృష్ణమ్మ అందాలను వీక్షించడానికి పర్యాటకులు పోటెత్తారు. శనివారం విద్యాసంస్థలకు సెలవు కావడంతో లక్ష మందికిపైనే తరలివచ్చినట్లు అధికారులు చెబుతున్నారు.
ఉదయం నుంచి డ్యామ్ వద్ద కొత్త బ్రిడ్జి, జల విద్యుత్ కేంద్రం, శివాలయం పరిసరాలు పర్యాటకులతో కిక్కిరిసిపోయాయి. డ్యామ్ క్రస్ట్ గేట్ల ద్వారా జాలువారుతున్న కృష్ణమ్మ జల సవ్వడులను పర్యాటకులు వీక్షిస్తూ సెల్ఫీలు, ఫొటోలు దిగారు. నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు పైనుంచి భారీగా వరద వస్తున్నది. రిజర్వాయర్ నీటిమట్టం 590 (312 టీఎంసీలు) అడుగులకుగానూ ప్రస్తుతం 588.00 (306.10 టీఎంసీలు) అడుగులు ఉన్నది. శ్రీశైలం నుంచి 1,72,800 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నాగార్జునసాగర్‌కు కొనసాగుతుండగా అంతే మొత్తంలో దిగువకు వదిలారు. శనివారం 16 గేట్లు 5 అడుగుల ఎత్తి మొత్తం అవుట్ ఫ్లో 1,62,829 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు.
కనిపించని, రెవెన్యూ మున్సిపల్ సిబ్బంది సేవలు
డ్యామ్ అందాలను తిలకించడానికి లక్షకు పైగా పర్యాటకులు సాగర్‌కు వస్తున్నారు. కానీ పర్యాటకుల కోసం మున్సిపల్, రెవెన్యూ శాఖలు మంచి నీటి వసతులు, మెడికల్ క్యాంప్‌లు, అంబులెన్స్ వంటి సౌకర్యాలు కల్పించలేదు. మల, మూత్ర విసర్జనకు ఏర్పాట్లు చేయలేదు. దాంతో మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఏదైనా ప్రమాదం జరిగితే 5 కిలోమీటర్లు దూరంలో ఉన్న దవాఖానకు తరలించే లోపు ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉన్నది. ఇప్పటికైనా స్థానిక అధికారులు దీనిపై దృష్టి పెట్టాలని పర్యాటకులు కోరుతున్నారు.
సెలవులు కావడంతో డ్యామ్ ను చూసేందుకు భారీగా వస్తున్న యాత్రికులు.వాహనాలు అధిక సంఖ్యలో రావటంతో పోలీసులు అదుపు చేయలేకపోతున్నారు. రద్దీ ఎక్కువ వుండటంతో వాహనాలను రోడ్డు కి ఇరువైపులా పార్కింగ్ చేసి వెళ్ళి పోయిన వాహన దారులు.కిలో మీటర్ల మేర నిలిచిపోయిన ట్రాఫిక్ నిబంధనలు తీవ్రత ఇబ్బందులు పడుతున్న చిన్న పిల్లలు, మహిళలు. నాగార్జునసాగర్ ప్రాంతం సందడిగా ఉన్నది. అందుకు తగ్గట్లుగా ట్రాఫిక్ ఇబ్బందులు రాకుండా పోలీసులు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు.