16-08-2025 04:08:51 PM
రానున్న 2 రోజులు అప్రమత్తంగా ఉండాలి
కలెక్టర్ పమేలా సత్పతి
నగరంలో పలు ప్రాంతాలు పరిశీలన
కరీంనగర్ (వికాయక్రాంతి): భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు ఇబ్బంది పడకుండా రోడ్లపై, ఖాళీ స్థలాల వద్ద వర్షపు నీరు నిలవకుండా చర్యలు తీసుకోవాలని, భారీ వర్షాల సూచన నేపథ్యంలో రానున్న రెండు రోజులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ పమేలా సత్పతి(Collector Pamela Satpathy) అధికారులను ఆదేశించారు. వరద నీరు నిలిచే అవకాశం ఉన్న జిల్లా కేంద్రంలోని కట్టరాంపూర్ పరిధిలోని గౌతమినగర్, అలుగునూర్ చౌరస్తాలను శనివారం నగరపాలిక కమిషనర్ ప్రపుల్ దేశాయ్, డీఆర్ఎఫ్(డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్) సిబ్బందితో కలిసి పరిశీలించారు. గౌతమినగర్ లో డ్రైనేజీ లేక రోడ్డుపై, ఖాళీ స్థలాల్లో వరద చేరుతుంది.
దీంతో భూముల యజమానులు అభ్యంతరం తెలుపగా.. ప్రజలకు, వాహనదారులకు ఇబ్బంది లేకుండా వరద వెళ్లేలా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. వర్షాల వేళ నిత్యం అప్రమత్తంగా ఉంటూ.. నాలాలు శుభ్రం చేసి రోడ్లపై చెత్తాచెదారం లేకుండా చూడాలని పేర్కొన్నారు. మునిసిపల్, రెవిన్యూ, పోలీస్, ఆర్ అండ్ బి, విద్యుత్, పంచాయతీరాజ్ ఇరిగేషన్ శాఖ అధికారులు రానున్న రెండు రోజుల్లో మరింత అప్రమత్తంగా ఉండాలని అన్నారు. సమన్వయంతో వర్షాల వల్ల ఎదురయ్యే సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. వారి వెంట మున్సిపల్ డీఈ వెంకటేశ్వర్లు, టౌన్ ప్లానింగ్ ఏసీపీ శ్రీధర్, డీఆర్ఎఫ్ సిబ్బంది రెవెన్యూ అధికారులు తదితరులు ఉన్నారు.