16-08-2025 03:53:04 PM
ఇందిరా మహిళ శక్తి కింద ఎరువులు, ఫర్టిలైజర్ దుకాణాల ఏర్పాటు
ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్
బొల్లారం, చందుర్తిలో ఎరువులు, ఫర్టిలైజర్ దుకాణాలు ప్రారంభం
హాజరైన కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
రాజన్న సిరిసిల్ల (విజయక్రాంతి): ఇందిరా మహిళా శక్తి కింద ఎరువులు, ఫర్టిలైజర్ దుకాణాన్ని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని, ఆర్థికంగా రాణించాలని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్(MLA Aadi Srinivas) పిలుపునిచ్చారు. ఇందిరా మహిళా శక్తి కింద వేములవాడ రూరల్ మండలం బొల్లారంలో శ్రీ శివరామ, చందుర్తిలో తులసి గ్రామ సమైక్య మహిళా సంఘం ద్వారా ఏర్పాటు చేసిన ఎరువులు & విత్తనాలు దుకాణాలను ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా(Collector Sandeep Kumar Jha)తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం మేరకు ఇందిరా మహిళ శక్తి కింద జిల్లాలోని మహిళా సంఘాలకు ఇప్పటికే క్యాంటీన్లు, డైరీ యూనిట్, కోడి పిల్లల పెంపకం, ఆర్టీసీ బస్సులు, పెట్రోల్ బంక్, ఇతర స్వయం ఉపాధి యూనిట్లను అందజేస్తున్నామని తెలిపారు.
త్వరలో ఇందిరా మహిళా శక్తి జిల్లాలోని మహిళా సంఘాల సభ్యులకు రైస్ మిల్లులు, సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. జిల్లాలో మొత్తం 23 దుకాణాలు మహిళా సంఘాల ఆధ్వర్యలో ఏర్పాటు చేయనున్నామని, ఇందులో భాగంగా ఇప్పటికే పలు దుకాణాలు ప్రారంభించామని వివరించారు. మహిళలు ప్రణాళిక ప్రకారం నిర్వహించి రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు అందుబాటులో ఉంచాలని సూచించారు. రైతులు ఎరువులు విత్తనాలు, పురుగు మందులు కొనుగోలు చేసి మహిళలకు ఆర్థికంగా మద్దతు పలకాలని కోరారు. రాష్ట్రంలోని కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.
కార్యక్రమంలో రుద్రంగి మార్కెట్ కమిటీ చైర్మన్ చెలుకల తిరుపతి, డీఆర్డీఓ శేషాద్రి, మండల వ్యవసాయ అధికారులు తదితరులు పాల్గొన్నారు. గంభీరావుపేట ఇందిరా మహిళా కింద గంభీరావుపేటలో విజయలక్ష్మి గ్రామ సమైక్య మహిళా సంఘం ద్వారా ఏర్పాటు చేసిన ఎరువులు & విత్తనాలు దుకాణాన్ని శనివారం ఉదయం మహిళా సంఘం బాధ్యులు ప్రారంబించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. ప్రణాళిక ప్రకారం వ్యాపారం చేసుకొని ఆర్థికంగా వృద్ధి చెందాలని సూచించారు.కార్యక్రమంలో గంభీరావుపేట మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ కొమిరిశెట్టి విజయ, డీఆర్డీఓ శేషాద్రి, తహసిల్దార్ మారుతి రెడ్డి, మండల వ్యవసాయ అధికారులు, మహిళా సంఘాల సభ్యులు రైతులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.