calender_icon.png 18 July, 2025 | 8:35 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

టాలీవుడ్ ముందడుగు

17-06-2025 12:00:00 AM

గద్దర్ చలనచిత్ర అవార్డుల పండుగ తెలుగు సినీ అభిమానులకు కన్నులవిందు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన ఈ పురస్కారాల కార్యక్రమం ఎంతో అట్టహాసంగా జరిగింది. నంది అవార్డుల స్థానం లో తెలంగాణ ప్రభుత్వం గద్దర్ ఫిల్మ్ అవార్డులు ప్రదానం చేయాలని నిర్ణయించుకొని తెలుగు సినీ తారా తోరణాన్ని హైటెక్స్ వేదికగా అభిమానుల ముందు నిలిపింది.

వివిధ కారణాలతో 14 ఏళ్ల క్రితం ఆగిపోయిన నంది అవార్డుల తర్వాత గద్దర్ ఫిల్మ్ అవార్డులు ఆ స్థానాన్ని భర్తీ చేశాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని తెలుగువారికి వినోదాన్ని అందిస్తున్న టాలీవుడ్‌కు ఈ గద్దర్ ఫిల్మ్ అవార్డుల వేదిక కొత్త ఊపునందిస్తుందనడంలో సందేహం లేదు. బాలీవుడ్‌కు ప్రత్యామ్నాయంగా ఎదిగిన టాలీవు డ్ ఇప్పుడు హిట్ చిత్రాలతో దేశ చిత్ర రంగాన్నే శాసించే స్థాయికి ఎదిగింది.

బాక్సాఫీస్ కలెక్షన్ల పరంగా కొద్ది సంవత్సరాల నుంచి టాలీవుడ్ చిత్రాల ధాటికి బాలీవుడ్ చిత్రాలు కుదేలయ్యాయి. బాహుబలి, ఆర్‌ఆర్‌ఆర్, పుష్ప వంటి సినిమాలు దేశంలో సంచలనంగా మారాయి. ఆ చిత్రా ల్లోని డైలాగులు, పాటలు ప్రపంచమంతా మార్మోగాయి. సృజనాత్మకతకు భారీ పెట్టుబడి జోడించి తీస్తున్న టాలీవుడ్ సినిమాలకు పోటీ లేకుండా పోయింది.

దశాబ్ద కాలంగా వివిధ భాషల్లోకి, ముఖ్యంగా హిందీలోకి పలు టాలీవుడ్ చిత్రాలు డబ్ అవుతున్నాయి. మంచి కలెక్షన్లు సాధిస్తున్నాయి. అందుకే తెలుగు చిత్రాలకు, కథా నాయకీ నాయకులకు పలు రాష్ట్రాల్లో మంచి క్రేజ్ వచ్చింది. ఓటీటీ ప్లాట్‌ఫాంలు కూడా తెలుగు సినిమాలకు ఇతర భాషల్లో పాప్యులారిటీని తెచ్చిపెట్టాయి. తక్కువ బడ్జెట్‌తో నిర్మించిన చిన్న చిత్రాలకు ఓటీటీ ప్లాట్‌ఫాంలలో మంచి పేరు వచ్చింది. 

అయితే, చిన్న నిర్మాతలకు, ఎగ్జిబిటర్లకు, సినిమా హాళ్ల యజమానులకు సినీ ఇండస్ట్రీలో ఎదురవుతున్న సమస్యలు ఇన్నీ అన్నీ కావు. ముఖ్యంగా సినిమా హాళ్ల నిర్వహణలో వ్యయప్రయాసలు ఎక్కువై అవి పదుల సంఖ్యలో మూత పడుతున్నాయి. సమ్మిళితంగా ఇలాంటి సమస్యలను తెలుగు చిత్ర పరిశ్రమ అధిగమించకపోతే సింగిల్ స్క్రీన్ థియేటర్లకు ఆర్థిక కష్టాలు తప్పవు. అవి పూర్తిగా కనుమరుగయ్యే రోజులు ఎంతో దూరంలో లేవు.

తెలుగువారు ఎక్కువ సంఖ్యలో వున్న విదేశాల్లో, ఓటీటీ ప్లాట్‌ఫాంలలో, మల్టీప్లెక్స్‌లలో సినిమాలు రిలీజైతే చాలు, పెట్టిన పెట్టుబడి వస్తుందనే ఆలోచన విడనాడి ఒక పరిశ్రమగా టాలీవుడ్ తన చిత్రాలను సామాన్య ప్రజానీకానికి అందుబాటులో ఉంచాలి. చిత్ర నిర్మాణానికి బాలీవుడ్ నుంచి కూడా హైదరాబాద్‌కు రావాలని, అందుకు అన్ని సదుపాయాలను తమ ప్రభుత్వం అందించడానికి సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించడం ముదావహం.

తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్‌లో టాలీవుడ్‌కు ఒక అధ్యాయాన్ని ఇద్దామని ముఖ్యమంత్రి సినీ ప్రముఖులకు గద్దర్ అవార్డుల ప్రదానోత్సవం వేదికపై నుంచి మంచి స్ఫూర్తిని అందించారు. అటు ఆంధ్రప్రదేశ్‌లో కూడా ప్రభుత్వం, సినీ పరిశ్రమ సమస్యలను చర్చించి, పరిష్కారాలను కనుగొనేందుకు సిద్ధమైంది. బాక్సాఫీస్‌ను కొల్లగొట్టే పెద్ద సినిమాలే కాదు, అదే సృజనాత్మకతతో తీస్తున్న చిన్న చిత్రాలు కూడా చితికి పోకుండా చూడాల్సిన అవసరముంది. ముఖ్యంగా తెలంగాణ సినీ కళాకారులకు ప్రభుత్వం తగిన విధంగా ప్రోత్సాహం అందించాలి.