24-05-2025 12:00:00 AM
అర్జున్ అంబటి హీరోగా, జెన్నీఫర్ ఇమ్మాన్యుయేల్ కథానాయికగా నటిస్తున్న తాజాచిత్రం ‘పరమపద సోపానం’. అచ్చమైన తెలుగు టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా ఓ థ్రిల్లర్ ప్రేక్షకుల ముందుకురానుంది. ఎస్‌ఎస్ మీడియా పతాకంపై గిడిమిట్ల శివప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గుడిమెట్ల ఈశ్వర్ సహ నిర్మాతగా వ్యవరిస్తున్నారు. కథానాయ కుడు అర్జున్ అంబటి ఇంతకుముందు ‘అర్ధనారి’ సినిమా తో టాలీవుడ్‌లో హీరోగా తెరంగేట్రం చేశారు.
ఆ చిత్రంతో మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు. తర్వాత బిగ్‌బాస్ రియాలిటీ షోతో ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. ఇప్పుడు యువ దర్శకుడు నాగశివతో చేతులు కలిపారు. డైరెక్టర్ నాగశివ గతంలో పూరీజగన్నాథ్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశారు. దీనికి కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
ఇప్పటికే అన్ని కార్యక్ర మాలూ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా జూలై 11న విడుదల కానుంది. దీంతో చిత్రబృందం ప్రమోషన్స్‌కు తెరతీసింది. ఇందులో భాగంగానే ఈ సినిమా నుంచి ‘చిన్ని చిన్ని తప్పులేవో’ అనే లిరికల్ సాంగ్‌ను తాజాగా విడుదల చేసింది.
‘చిన్ని చిన్ని తప్పులేవో నీతో మళ్లీమళ్లీ చేసు కోనా.. పెదవి అంచు తాకుతూనే నేను నీపై వాలనా.. చిలిపి చిలిపి ఆటలేవో నీతో మళ్లీమళ్లీ ఆడుకోనా.. మనసులోని ఇష్టమంతా నీ పేరే పలికేనా..’ అంటూ సాగే ఈ పాట యువతను అమితంగా ఆకట్టుకుంటోంది. సంగీత దర్శకుడు డేవ్ జాండ్ స్వరపరిచిన ఈ గీతాన్ని పృథ్వీచంద్ర, అదితి బావరాజు ఆలపించగా, రాంబాబు గోశాల సాహిత్యం అందించారు.