31-07-2025 01:28:53 AM
ప్రాజెక్టుకు కొనసాగుతున్న భారీ ఇన్ ఫ్లో
నాగార్జునసాగర్, జూలై 30: శ్రీశైలం నుంచి నల్లగొండ జిల్లాలోని నాగార్జునసాగర్ భారీగా ఇన్‌ఫ్లో వస్తుండటంతో సాగర్ 26 క్రస్ట్ గేట్లు ఎత్తి సాగరం వైపునకు నీటిని విడుదల చేసిన విషయం తెలిసిందే. 26 క్రస్ట్ గేట్ల నుంచి జాలువారుతున్న కృష్ణమ్మ సోయగాలను తిలకించేందుకు పర్యాటకులు తరలివస్తున్నారు. తెలంగాణ, ఏపీ నుంచి అధిక సంఖ్య పర్యాటకులు చేరుకోవడంతో సాగర్ పరిసరాలు రద్దీగా మారాయి.
ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. సాగర్ వద్ద బుద్ధవనం, అనుపు, ఎత్తిపోతల, కొత్తవంతెన ప్రాంతాల్లో సందడి చేస్తున్నారు. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులకు గాను ప్రస్తుతం 586.00 అడుగులవద్ద నీరు నిల్వవుంది. డ్యామ్ పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్ధ్యం 312 టీఎంసీలు కాగా ప్రస్తుతానికి 300.3200 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఇన్‌ఫ్లో 2,82,364 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 2,47,213 నమోదవుతున్నది.
డ్యాంకు కాల్షియం ముప్పు
నాగార్జున సాగర్ డ్యాం గురించి కీలక విషయం విజయక్రాంతి వెలుగులోకి తెచ్చింది. ఈ జలాశయానికి కాల్షియం వల్ల ముప్పు పొంచి ఉందని అధికారులు చెపుతున్నారు. జలాశయం లోపలి గోడల రంధ్రాల్లో పేరుకుపోయిన ఈ ఖనిజం వల్ల డ్యాం స్పిల్‌వేతో పాటు గ్యాలరీలోని గోడలకు పగుళ్లు ఏర్పడే అవకాశముందని ఇంజినీర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నీటిపారుదల శాఖ అధికారులు గోడల్లో పేరుకుపోయిన కాల్షియంను తొలగించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.