01-11-2025 12:00:00 AM
ఎల్బీనగర్, జులై 12 : అక్రమ నిర్మాణాలను అడ్డుకోవాలని హైకోర్టు ఎన్నిసార్లు ఆదేశాలు ఇచ్చిన బల్దియా టౌన్ ప్లానింగ్ అధికారులు మొద్దు నిద్ర వీడడం లేదు. దేవుడైన మీ ఆలోచనను పసిగట్టలేడు’ నిర్మాణం పూర్తయ్యేదాకా కండ్లు మూసుకుంటారా?.. భవిష్యత్ తరాలు క్షమించవు అని ఆగ్రహం వ్యక్తం చేసినా ‘దున్నపోతు మీద వాన చినుకు‘ అన్న చందంగా ఎల్బీనగర్ జోనల్ టౌన్ ప్లానింగ్ అధికారులు వ్యవహరిస్తున్నారు.
ఎల్బీనగర్ నియోజక వర్గంలో అనేక అక్రమ నిర్మాణాలు యధేచ్చగా కొనసాగుతున్నా... కన్నెత్తి చూడడం లేదు. ఫలితంగా అనుమతులు లేని భవనాలు, అపార్ట్ మెం ట్లు, షెడ్ల నిర్మాణాలు అనేకం వెలుస్తున్నా యి. వసూళ్ల మత్తులో అక్రమ నిర్మాణాలను అడ్డుకోవాల్సిన టౌన్ ప్లానింగ్ అధికారులే నిర్మాణదారులకు మద్దతు ఇస్తున్నారు. దీంతో అనుమతులు లేని నిర్మాణాలు వెలుస్తుండడంతోపాటు ప్రభుత్వ ఖజానాకు చేరాల్సిన ఆదాయం పక్కదారి పడుతుంది.
అనుమతులు ఒకటి... నిర్మాణాలు మరోటి
ఎల్బీనగర్ నియోజకవర్గంలోని హయత్ నగర్, ఎల్బీనగర్, సరూర్ నగర్ సర్కిళ్ల పరిధిలో కొనసాగుతున్న నిర్మాణాల్లో అత్యధిక భాగం అనుమతులు తీసుకోకుండా చేపడుతు న్నారు. టీఎస్ బీ పాస్ లో ఒకరకమైన అనుమతులు తీసుకుని.. ఇతర నిర్మాణాలు చేపడుతున్నారు. రెసిడెన్షియల్ నిర్మాణ అనుమతులతో కమర్షియల్ కట్టడాలు నిర్మిస్తున్నారు. దీంతో ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి పడుతుంది.
ఎల్బీనగర్ నియోజకవర్గంలో అక్రమ నిర్మాణాలను టౌన్ ప్లానింగ్ అధికారులు అదనపు ఆదాయ వనరుగా మార్చుకున్నారు. ఆయా డివిజన్లలో రెసిడెన్షియల్ అనుమతులతో కమర్షియల్ నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి. అనుమతులు జీ + 2, 3, 4 వరకు తీసుకుని అదనపు అంతస్తులు చేపడుతున్నారు. దీంతో పాటు నిబంధనలు పాటించకుండా సెట్ బ్యాక్ లేకుండా సెల్లార్ల నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి.
క్షేత్రస్థాయిలో అక్రమ నిర్మాణాలను గుర్తించాల్సిన టౌన్ ప్లానింగ్ అధికారులు, చైన్ మన్లు, ఇతర సిబ్బంది కండ్లు మూసుకొని చూస్తున్నారు. ఎవరైనా అక్రమ నిర్మాణాలపై సమాచారం లేదా ఫిర్యాదు చేస్తే తూతూ మంత్రంగా నోటీసులు ఇస్తున్నారు. చర్యలు తీసుకోవడానికి ముందే నిర్మాణాదారులకు సమాచారం ఇచ్చి, నిర్మాణాలను పూర్తి చేయిస్తున్నారు.
జీహెచ్‌ఎంసీ చైన్మెన్ల పర్యవేక్షణ లోపం, అధికారుల నిర్లక్ష్యంతోనే అక్రమ కట్టడాలు నిరభ్యరంతరంగా కొనసాగుతున్నాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అక్రమ అంతస్తులు నిర్మిస్తున్నా అధికారులు ఎందుకు అలసత్వం వహిస్తున్నారన్న ప్రశ్నలు సర్వత్రా వినిపిస్తున్నాయి.
స్పందించని అధికారులు
ఎల్బీనగర్ జోనల్ పరిధిలో జరుతున్న అక్రమ నిర్మాణాలు, అనుమతులు లేని కట్టడాలు, ప్రభుత్వ స్థలాల ఆక్రమణలు కొనసాగుతున్నాయి. వీటిపై జీహెచ్‌ఎంసీ అధికారులు స్పందించడం లేదు. స్థానికులు, కాలనీ సంఘాలు ఫిర్యాదు చేసినా అధికారులు చర్యలు తీసుకోవడం లేదు. క్షేత్రస్థాయిలో పర్యటించి, అక్రమ నిర్మాణాలను పరిశీలించాల్సిన అధికారులు ఆఫీస్ మెట్లు దిగడం లేదు. చైన్ మన్లు, టౌన్ ప్లానింగ్ సిబ్బంది ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వడం లేదు. జోనల్ కమిషనర్ కు ఫిర్యాదు చేసినా స్పందించడం లేదని ఆయా కాలనీ సంఘాల నాయకులు పేర్కొంటున్నారు.
ఆయా డివిజన్లలో అక్రమ నిర్మాణాలు
1.హయత్ నగర్ డివిజన్ లో భారీగా అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు. ముఖ్యంగా పాత విజయవాడ రోడ్డు, డిఫెన్స్ కాలనీ రోడ్డు, కుంట్లూర్ వెళ్లే రోడ్డులో...
2. మన్సూరాబాద్ డివిజన్ లోని సుష్మా టాకీస్ - సహారా రోడ్డు, మన్సూరాబాద్ చౌరస్తా రోడ్డులో..
3. నాగోల్ డివిజన్ పరిధిలోని ఆనంద్ నగర్ నుంచి బండ్లగూడ రోడ్డులో
4. వనస్థలిపురం డివిజన్ పరిధిలోని వివిధ ప్రధాన కాలనీల్లో అనేక అనుమతి లేని నిర్మాణాలు చేపడుతున్నారు.
5. హస్తినాపురం డివిజన్ పరిధిలోని జడ్పీ రోడ్డు మొత్తంలో అనేక సంఖ్యలో అక్రమ నిర్మాణాలు ఉన్నాయి. కమర్షియల్ షెడ్లు రోడ్డుకు ఇరువైపులా ఉన్నాయి
6. బీఎన్ రెడ్డి నగర్ డివిజన్ పరిధిలోని ఎన్జీవో కాలనీ రోడ్డు, బీడీఆర్ గార్డెన్ రోడ్డు, ఎస్ కేడీ నగర్ కాలనీలో అనుమతులు ఒక విధంగా... నిర్మాణాలు మరో విధంగా చేపడుతున్నారు.