calender_icon.png 26 October, 2025 | 8:15 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గోదావరిఖనిలో విషాదం

26-10-2025 05:01:13 PM

నది స్నానానికి వెళ్లిన ప్రేమ జంట..

ప్రమాదవశాత్తు యువతి మృతి..

యువకుడిని కాపాడిన మత్స్యకారులు..

గోదావరిఖని (విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా గోదావరిఖని శివారులోని గోదావరి నది వద్ద విషాదం అలుముకుంది. గోదావరి నది స్నానానికి వెళ్లిన ప్రేమ జంట ప్రమాదానికి గురయ్యారు. గోదావరి నదిలో నీటి ప్రవాహం ఉదృతంగా ఉండడంతో నది స్నానం చేస్తున్న యువతి ప్రమాదానికి గురై మృతిచెందగా, అక్కడే ఉన్న మత్స్యకారులు గుర్తించి నదిలో కొట్టుకుపోతున్న యువకుడిని ప్రాణాలతో కాపాడి ఒడ్డుకు చేర్చారు. హృదయ విదారకరమైన ఈ సంఘటన జిల్లాలో కలకలం సృష్టించింది. గోదావరిఖని విటల్ నగర్ కు చెందిన రవితేజ(22)కు పెద్దపల్లి మండలంలోని పెద్దబొంకూర్ గ్రామానికి చెందిన మౌనికతో ఇన్ స్టాగ్రామ్ లో గత రెండు సంవత్సరాల క్రితం పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది.

వీరి ప్రేమ వివాహానికి యువకుడి తల్లిదండ్రులు అంగీకరించడంతో ఆ ప్రేమ జంట పెళ్లి చేసుకోవడానికి సిద్ధమయ్యారు. కార్తీక మాసం కావడంతో అంతా సవ్యంగా జరగాలని ఆదివారం ఉదయం అబ్బాయి తల్లిదండ్రులు ఆ ప్రేమ జంటను తీసుకొని గోదావరి నదికి పుణ్య స్నానం చేయడానికి వెళ్లారు. నదిలో నీటి ప్రవాహం ఉదృతంగా ఉండడంతో యువతి అనుకోకుండా లోతు ప్రాంతంలోకి వెళ్లి ప్రమాదానికి గురైంది. ఆమెను రక్షించడానికి ఆ యువకుడు వెళ్లి అతను సైతం ప్రమాదంలో చిక్కుకున్నాడు. వీరి అరుపులు విని అక్కడే ఉన్న జాలర్లు వెంటనే అప్రమత్తమై నదిలోకి వెళ్లి యువకుడిని మాత్రం కాపాడగలిగారు. అప్పటికే నీటిలో మునిగిపోయి మౌనిక ప్రాణాలు విడిచింది. సంఘటన విషయం తెలుసుకొని పోలీసులు హుటాహుటిన చేరుకొని యువతి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గోదావరిఖని ప్రభుత్వ దవాఖానకు తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.