26-10-2025 08:07:40 PM
భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు..
రేగొండ (విజయక్రాంతి): బుగులోనీ జాతర పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్య నారాయణ రావు అన్నారు. మండలంలోని తిరుమలగిరి గ్రామ శివారులో వెలసిన శ్రీ బుగులోని వేంకటేశ్వర స్వామి వారి జాతర బ్రహ్మోత్సవాలు వచ్చే నెల 5వ తేదీ నుండి ప్రారంభం కానున్నాయి. దీంతో అక్కడే జరిగే అభివృద్ధి పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులకు, కాంట్రాక్టర్లకు, సంబంధిత శాఖల అధికారులకు ఎమ్మెల్యే గండ్ర ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు ఎమ్మెల్యే ఆదివారం సాయంత్రం జాతర ప్రాంగణంలో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులను అధికారులతో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... బుగులోని జాతర తెలంగాణ సాంస్కృతిక వైభవానికి ప్రతీకగా నిలుస్తుందన్నారు. ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు, సందర్శకులు స్వామి వారిని దర్శించుకుని వారి మొక్కలు తీర్చుకుంటారన్నారు. జాతరకు వచ్చే భక్తుల సౌకర్యార్థం రహదారులు, తాగునీరు, విద్యుత్, పారిశుధ్యం వంటి సదుపాయాలను మెరుగుపరచడం అత్యవసరమని పేర్కొన్నారు. జాతర సమయానికి ముందే అన్ని పనులు పూర్తవ్వాలనే ఉద్దేశ్యంతో ప్రతి రోజు పనుల పురోగతిని సమీక్షించనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ప్రజల సహకారంతో బుగులోని జాతరను రాష్ట్ర స్థాయి వేడుకగా మార్చే లక్ష్యంతో సీఎం రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.