29-01-2026 01:51:43 PM
అచ్చంపేట జనవరి 29: తెలంగాణ రాష్ట్రంలో ఇటీవలే కొత్తగా ఎన్నికైన గ్రూప్–వన్ అధికారులకు ఫిబ్రవరి 2 నుంచి 5 వరకు అచ్చంపేట పట్టణంలోని యూత్ ట్రైనింగ్ సెంటర్లో, శిక్షణా తరగతులకు సంబంధించిన ఏర్పాట్లను గురువారం నాగర్‌కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ పరిశీలించారు. ఒక విడతలో 150 మంది గ్రూప్–వన్ అధికారులు ఈ శిక్షణా తరగతుల్లో పాల్గొననున్న నేపథ్యంలో, వారికి అవసరమైన వసతి, భోజన సౌకర్యాలు, శిక్షణ తరగతుల నిర్వహణకు అవసరమైన తరగతి గదులు, సమావేశ మందిరాలు తదితర ఏర్పాట్లను అచ్చంపేటలోని గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలో కలెక్టర్ ప్రత్యక్షంగా పరిశీలించారు.
ఈ సందర్భంగా శిక్షణ తరగతుల నిర్వహణకు ఉపయోగించే గదుల సౌకర్యాలు, కూర్చోవడానికి సరైన వసతులు, విద్యుత్, తాగునీరు, శుభ్రత, భద్రత వంటి అంశాలపై అధికారులతో కలెక్టర్ ఆరా తీశారు. అలాగే రాత్రి వసతి ఏర్పాట్లు, భోజన ఏర్పాట్ల నాణ్యత, వంటశాల నిర్వహణ, మరుగుదొడ్లు, మూత్రశాలల శుభ్రతపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. శిక్షణకు హాజరయ్యే గ్రూప్–వన్ అధికారులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు సమయానికి పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని, శిక్షణా కార్యక్రమం విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ సూచించారు. కలెక్టర్ వెంట జిల్లా అటవీ శాఖ అధికారి రేవంత్ చంద్ర, జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి ఫిరంగి, అచ్చంపేట ఆర్డిఓ యాదగిరి, ఇతర అధికారులు తదితరులు ఉన్నారు.