18-09-2025 01:06:45 AM
గీతంలో ముగిసిన అధ్యాపక వికాస కార్యక్రమం
పటాన్చెరు, సెప్టెంబర్ 17 :వాహనాల రూపకల్పన (డిజైన్), తయారీలో అధునాతన సాంకేతిక పురోగతిపై మూడు రోజులు అధ్యాపక వికాస కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఫ్యూజన్ 360 యొక్క అధునాతన లక్షణాలు పేరిట గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీలోని మెకానికల్ ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమం సెప్టెంబరు 15న ఆరంభమై, 17వ తేదీ తో ముగిసింది.
ఈ కార్యక్రమంలో హైదరాబాదులోని డిజైన్ ల్యాబ్స్ నుంచి ఆటోడెస్క్ ఫ్యూజన్ శిక్షకుడు అజయ్ కుమార్ రెడ్డి ప్రధాన వక్తగా పాల్గొన్నారు. మూడు రోజుల పాటు, అసెంబ్లీ పరిమితులు సిమ్యులేషన్ ఆప్టిమైజేషన్ త్రీడీ ప్రింటింగ్ కోసం తయారీ యానిమేషన్ & రెండరింగ్, మేనేజ్ ఫీచర్స్ సర్ఫేస్ మోడలింగ్ వంటి విస్తృత శ్రేణి అధునాతన మాడ్యూళ్ల ద్వారా పాల్గొనేవారికి మార్గనిర్దేశం చేశారు.
ప్రతి సెషన్ ఆకర్షణీయమైన ప్రశ్నోత్తరాలతో ముగియగా, అధ్యాపకులు పలు సందేహాలను లెవనెత్తి వారి అవగాహనను మరింతగా పెంచుకున్నారు. విస్తృతమైన ఆచరణాత్మక అభ్యాసంతో పాటు సాఫ్ట్ వేర్ తో ఆచరణాత్మకంగా వారి సాంకేతిక నైపుణ్యాలకు పదును పెట్టుకున్నారు.
గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీ డైరెక్టర్, కోర్ ఇంజనీరింగ్ డీన్ ప్రొఫెసర్ వీ.ఆర్. శాస్త్రి పర్యవేక్షణలో సీనియర్ అధ్యాపకుడు ప్రొఫెసర్ పున్నా ఈశ్వరయ్య సమన్వయంలో ఈ కార్యక్రమం కొనసాగింది. ముగింపు ఉత్సవంలో ఈ మూడు రోజుల కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తిచేసిన అధ్యాపకులకు పత్రాలను అందజేశారు.