రిజిస్ట్రేషన్ శాఖలో బదిలీలు షురూ!
జూనియర్ అసిస్టెంట్లు, షరాఫ్, టైపిస్ట్‌ల ట్రాన్స్‌ఫర్
నేడు సీనియర్ అసిస్టెంట్ల బదిలీ?
హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, జూలై 20 (విజయక్రాంతి): తెలంగాణ స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖలో బదిలీల ప్రక్రియ ప్రారంభమైంది. మొదటగా జూనియర్ అసిస్టె ంట్లను, షరాఫ్‌లను, టైపిస్ట్‌లను, ఆఫీస్ సబార్డినేట్‌లను బదిలీ చేస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. సుమారు 500 మందిని బదిలీ చేసిన ప్రభుత్వం, ఆదివారం సీనియర్ అసిస్టెంట్లను బదిలీ చేసే అవకాశం ఉందని ఆ శాఖ అధికారులు తెలిపారు. గత పదేండ్లుగా ఆ శాఖలో ప్రభుత్వం పూర్తిస్థాయిలో బదిలీలు చేపట్టలేదు. ఈ క్రమంలోనే ఆ శాఖలో అధికారులతో పాటు అన్ని స్థాయిల్లోని సిబ్బంది అవినీతికి అడ్డు అదుపు లేకుండా పోయిందని గుర్తించిన ప్రభుత్వం అన్ని విభాగాల ఉద్యోగులను బదిలీ చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా నెల రోజుల కిందటే ఆ శాఖలో ఆఫీస్ సబార్డినేట్ నుంచి డీఐజీల వరకు బదిలీ చేయాలని నిర్ణయించినప్పటికి భూముల ధరల సవరణ ప్రక్రియ ముగిసిన తర్వాతనే బదిలీ చేయాలని ఆ శాఖ అధికారులు ప్రభుత్వాన్ని కోరారు. అయితే భూముల సవరణల ప్రతిపాధనలు ప్రభుత్వానికి చేరడంతో బదిలీల ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభించింది.






