calender_icon.png 28 October, 2025 | 8:50 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భయం పుట్టిస్తున్న గ్యాస్ సిలిండర్ల రవాణా..

28-10-2025 06:04:51 PM

పాతబడిన వాహనాలతో ప్రమాదకర డెలివరీ లు..

పట్టించుకోని గ్యాస్ ఏజెన్సీలు, భద్రతకు ముప్పు..

రేగొండ (విజయక్రాంతి): రోజురోజుకూ పెరుగుతున్న వంట గ్యాస్ వినియోగదారులకు సకాలంలో సేవలు అందించడంలో గ్యాస్ ఏజెన్సీలు తగినంత శ్రద్ధ చూపడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా, గ్యాస్ సిలిండర్లను డెలివరీ చేసేందుకు వినియోగిస్తున్న వాహనాల పరిస్థితి చూస్తే ప్రజల భద్రత గాలిలో దీపంలా ఉంది. రేగొండ మండల కేంద్రంలోని గ్యాస్ ఏజెన్సీ వంట గ్యాస్ సిలిండర్లకు వినియోగిస్తున్న ఆటోను 'విజయక్రాంతి' క్లిక్ మనిపించింది.

ఈ ఫోటోలో కనిపిస్తున్న విధంగా, గ్యాస్ సిలిండర్ల డెలివరీకి వినియోగిస్తున్న ఆటో అత్యంత పాతబడి, తుప్పు పట్టి, శిథిలావస్థకు చేరుకుంది. ఇంజన్ సామర్థ్యం, బ్రేకులు, ఛాసిస్ వంటి కీలకమైన అంశాలు ఏమాత్రం భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా లేవని ఈ వాహనం స్థితి స్పష్టం చేస్తోంది. ఇన్ని సిలిండర్లను ఒకేసారి తరలించేందుకు ఈ వాహనం ఎంతవరకు సురక్షితమైనదనేది పెద్ద ప్రశ్న.

నిబంధనల ఉల్లంఘన..

నిబంధనల ప్రకారం, గ్యాస్ సిలిండర్లను రవాణా చేసే వాహనాలు ఖచ్చితంగా ఫిట్‌నెస్ సర్టిఫికేట్‌ను కలిగి ఉండాలి, ఎప్పటికప్పుడు తనిఖీలు చేయించుకోవాలి. ముఖ్యంగా, పేలుడు పదార్థాలను తరలించేటప్పుడు పాటించాల్సిన భద్రతా నియమాలు చాలా కఠినంగా ఉంటాయి.అయితే ఈ వాహనాన్ని చూస్తే, గ్యాస్ ఏజెన్సీలు కేవలం లాభం కోసమే చూస్తున్నాయే తప్ప, ప్రజల భద్రతను పూర్తిగా విస్మరించాయని అర్థమవుతోంది. రోడ్డుపై ఇలాంటి వాహనం పల్టీ కొట్టినా, లేదా అగ్ని ప్రమాదం జరిగినా అది ప్రజల ప్రాణాలకు, ఆస్తికి తీవ్ర నష్టాన్ని కలిగించే ప్రమాదం ఉంది.

అధికారులు స్పందించాలి..

సంబంధిత రవాణా శాఖ,పౌర సరఫరాల శాఖ అధికారులు తక్షణమే ఈ ప్రమాదకరమైన రవాణా పద్ధతులపై దృష్టి సారించి ఇలాంటి శిథిలావస్థలో ఉన్న వాహనాలను వినియోగిస్తున్న గ్యాస్ ఏజెన్సీలపై కఠిన చర్యలు తీసుకోవాలని వినియోగదారులు డిమాండ్ చేస్తున్నారు.