ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా
హైదరాబాద్: సంగారెడ్డి జిల్లాలోని కోహిర్ మండలం(Kohir Mandal) చింతల్‌ఘాట్ సమీపంలో మంగళవారం తెల్లవారుజామున జాతీయ రహదారి 65పై కర్ణాటక నుండి హైదరాబాద్(Karnataka to Hyderabad) వెళ్తున్న ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ఎదురుగా వస్తున్న మరో బస్సును తప్పించే ప్రయత్నంలో డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో వాహనం రోడ్డు పక్కకు దూసుకెళ్లింది.
ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 36 మంది ప్రయాణికులు ఉన్నారు. బస్సులో ఉన్న వారందరూ అత్యవసర ద్వారం ద్వారా బయటకు వచ్చి స్వల్ప గాయాలతో బయటపడ్డారు. స్థానిక అధికారులు, అత్యవసర సేవల సిబ్బంది సంఘటనా స్థలానికి హుటాహుటిన చేరుకుని తక్షణ సహాయాన్ని అందించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని, ఈ ప్రమాదానికి దారితీసిన కచ్చితమైన పరిస్థితులపై దర్యాప్తు చేస్తున్నారు. రోడ్డు పరిస్థితులను పరిశీలిస్తున్నారు. ఈ ప్రమాదం డ్రైవర్ తప్పిదం వల్లే జరిగిందా? ఇతర కారణాలు ఉన్నాయా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.




