02-12-2025 03:26:02 PM
జిల్లా కలెక్టర్ బి.ఎం సంతోష్
గద్వాల,(విజయక్రాంతి): గద్వాలలోని ఎస్టి వసతి గృహ విద్యార్థుల్లో కొందరు అస్వస్థతకు గురికావడంతో అవసరమైన చికిత్స చేయించినట్లు జిల్లా కలెక్టర్ బి.ఎం సంతోష్ తెలిపారు.మంగళవారం ఉదయం గద్వాల ఎస్టీ బాలుర వసతి గృహ విద్యార్థులు టిఫిన్ చేసి వారి పాఠశాలలకు వెళ్లాక సమీపంలోని ప్రభుత్వ అభ్యసన ఉన్నత పాఠశాలలో చదువుతున్న ఇద్దరు విద్యార్థులు ప్రార్థన సమయంలో ఎండ కారణంగా కొంత అస్వస్థతకు గురైనట్లు చెప్పారు. వారికి ఉపాధ్యాయులు వెంటనే విశ్రాంతి కల్పించారన్నారు. కాసేపటికి మరో 12 మంది విద్యార్థులు కూడా ఇబ్బంది పడడంతో ఉపాధ్యాయులు సంబంధిత అధికారులకు తెలియజేశారని కలెక్టర్ పేర్కొన్నారు.
వెంటనే ఉపాధ్యాయులు 14 మంది విద్యార్థులను ప్రభుత్వ ఆసుపత్రికి ప్రథమ చికిత్స నిమిత్తం తరలించినట్లు చెప్పారు. వీరందరికీ వైద్య పరీక్షలు నిర్వహించారని, ప్రథమ చికిత్స అనంతరం ఆరోగ్యం నిలకడగా ఉండడంతో వెంటనే విద్యార్థులందరినీ డిశ్చార్జి చేసినట్లు చెప్పారు. సంబంధిత అధికార యంత్రాంగం ఆసుపత్రికి వెళ్లి వివరాలు సేకరించినట్లు పేర్కొన్నారు. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిపై ఎవరు కూడా ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. జరిగిన ఘటనపై విచారణ జరిపిస్తామని కలెక్టర్ పేర్కొన్నారు. జిల్లాలోని ప్రభుత్వ వసతి గృహ విద్యార్థుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు.
ఆయా మండలాల్లోని తహసిల్దార్ లు, ఇతర మండల ప్రత్యేక అధికారులు నెలలో కనీసం మూడుసార్లు వారి పరిధిలోని సంక్షేమ వసతి గృహాలను ఆకస్మికంగా తనిఖీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. తాను కూడా తరచూ సంక్షేమ వసతి గృహాలతో పాటు, కస్తూర్బా విద్యాలయాలను సందర్శిస్తూ అక్కడ విద్యార్థులకు మెనూ ప్రకారం ఆహారం అందజేయడం, ఇతర సౌకర్యాల విషయంలో పర్యవేక్షణ చేస్తున్నట్లు చెప్పారు. ఆయా తరగతుల విద్యార్థులతో పాఠ్య పుస్తకాలు చదివించి ప్రతిభను పరీక్షిస్తున్నానని, చదువులో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఉపాధ్యాయులను ఆదేశించినట్లు కలెక్టర్ పేర్కొన్నారు.