02-12-2025 03:29:40 PM
కోతుల నివారణ ఉద్యమకర్త ఆమంద శంకర్
ఖానాపూర్,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం స్థానిక ఎన్నికల జోరు కొనసాగుతుండగా రాజకీయ పార్టీలు బలపరుస్తున్న అభ్యర్థులను ఓడించాలని, ప్రతి గ్రామంలో కోతుల సమస్యను తీరుస్తానని హామీ ఇచ్చిన నాయకుడికి ఓటు వేసి గెలిపించాలని కోతుల నివారణ ఉద్యమకర్త ఆమంద శంకర్ మంగళవారం ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రతి గ్రామంలో కోతుల సమస్య విపరీతమవుతుందని వాటిని ఏ నాయకుడు, అధికారులు, అరికట్ట లేకపోవడం వల్ల చాలామంది వాటికి భయపడి ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు ఉండగా ఈ సమస్య తీరుస్తామని ఏ ఒక్క పార్టీ తమ ఎజెండాలో తెలుపకపోవడం దారుణం అన్నారు.
ప్రస్తుతం స్థానిక ఎన్నికల నేపథ్యంలో గ్రామస్తులు ఎక్కడివారక్కడ అభ్యర్థులను నిలదీయాలని వాటిని నివారిస్తేనే ఓటు వేస్తామని హెచ్చరించాలని ఆయన కోరారు. వారు హామీ ఇవ్వకపోతే ఇండిపెండెంట్ అభ్యర్థులను ఓటు వేసి గెలిపించాలని కోరారు. దీంతో కోతుల సమస్య తీవ్రతను ప్రభుత్వానికి తెలిసేలా చేయాలని, ప్రభుత్వాలు కూడా అడవిలో విపరీతంగా పండ్ల చెట్లను పెంచి కోతులను అడవికి తరలించే వరకు ఉద్యమం కొనసాగిస్తామని హెచ్చరించారు.