calender_icon.png 20 August, 2025 | 10:45 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రాథమిక సహకార సంఘం ఎరువుల షాపును ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ

20-08-2025 08:12:47 PM

మహదేవపూర్,(విజయక్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండల కేంద్రంలోని ప్రాథమిక సహకార సంఘం ద్వారా ఏర్పాటు చేసిన ఎరువుల దుకాణాన్ని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎరువుల దుకాణంలో ఉన్న నిల్వలు, రైతులకు అందజేస్తున్న విధానంపై రికార్డులను పరిశీలించారు. రికార్డులు సక్రమంగా నిర్వహించడం లేదని ప్రాథమిక సహకార సంఘం కార్యనిర్వాణా అధికారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు అవసరమైన ఎరువులు సరిపడా మోతాదులో అందుబాటులో ఉంచి పంపిణీ చేయాలని ఆదేశించారు.

ఎరువుల పంపిణీలో ఎలాంటి లోటు పాట్లు లేకుండా పారదర్శకంగా రైతులకు పంపిణీ చేయాలని సూచించారు. రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని వ్యవసాయ శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండి నానో యూరియాపై రైతులకు అవగాహన కల్పించాలన్నారు. ఈ ప్రాంత రైతులకే తప్ప బయటికి రైతులకు ఎరువులు సరఫరా చేయరాదని ఆదేశించారు. పట్టాదారు పాస్ పుస్తకాలు లేని రైతులకు ఏ విధంగా ఇస్తున్నారని అడిగి తెలుసుకున్నారు.

సాగు విస్తీర్ణాన్ని బట్టి రెండు నుంచి మూడు బస్తాలు ఇస్తున్నామని అధికారులు తెలిపారు. ప్రైవేట్ డీలర్లు యూరియా కు ఇతర ఎరువుల లింకు పెట్టి ఇవ్వద్దని అలా చేస్తే పోలీస్ కేసులు నమోదు చేయడం జరుగుతుందని డీలర్ల లైసెన్సు రద్దు చేస్తామని హెచ్చరించారు. పంటలకు ఒకేసారి యూరియా వేయకుండా విడతల వారీగా ఏ మేరకు యూరియాను  వియోగించాలో రైతులకు అవగాహన కల్పించాలని వ్యవసాయ అధికారులకు సూచించారు. టాస్క్ ఫోర్స్ టీంలు ఎరువుల  విక్రయాలపై  నిరంతర పరిరక్షణ చేయాలని ఎక్కడైనా కొరత ఏర్పడితే ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో అధికారులు సిద్ధంగా ఉండాలని స్పష్టం చేశారు.