calender_icon.png 15 September, 2025 | 3:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అతలాకుతలం

15-09-2025 01:34:43 AM

-జీహెచ్‌ఎంసీ పరిధిలో భారీ వర్షం

-గంటల వ్యవధిలోనే 12 సెంమీ మేర వర్షపాతం నమోదు

-ప్రధాన వీధులు జలయయం.. లోతట్టు ప్రాంతాల్లోకి వరద

-వట్టినాగులపల్లిలో కుప్పకూలిన ప్రహరీ

- శిథిలాల్లో రెండు మృతదేహాలు లభ్యం 

-మరో నలుగురికి తీవ్రగాయాలు

-హబీబ్‌నగర్‌లో మామాఅల్లుళ్లు, ముషీరాబాద్‌లో యువకుడి గల్లంతు

హైదరాబాద్, సిటీ బ్యూరో, సెప్టెంబర్ 14 (విజయక్రాంతి): గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఆదివారం రాత్రి వర్షం దంచికొట్టింది. గంటల వ్యవధిలోనే సగటున 12 సెం.మీ వర్షపాతం నమోదైంది. భారీవర్షానికి గచ్చిబౌలి, హిమాయత్‌నగర్, వనస్థలిపురం, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మణికొండ, ఎల్బీనగర్, హయత్‌నగర్, ముషీరాబాద్, తార్నాక, సికింద్రాబాద్, బషీర్‌బాగ్, నాంపల్లి, అబిడ్స్, కోఠి సహా అన్ని ప్రాంతాల్లో రహదారులు జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లోకి వరద చేరిం ది. జీహెచ్‌ఎంసీ, హైడ్రా బృందాలు రంగంలోకి దిగి ఎక్కడికక్కడ సహాయక చర్యలు చేపట్టారు. జీహెచ్‌ఎంసీ మేయర్ విజయలక్ష్మి స్వయంగా సహాయక చర్యల్లో పాల్గొ న్నారు. ట్రాఫిక్ పోలీసులు నీరు నిలిచిన ప్రాంతాల్లో రాకపోకలను మళ్లిస్తూ పరిస్థితిని చక్కదిద్దారు. ట్రాఫిక్‌పరమైన ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నారు.

కూలిన ప్రహరీ.. ఇద్దరి మృతి, నలుగురికి తీవ్రగాయాలు..

భారీ వర్షానికి గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్ పరిధిలోని వట్టినాగులపల్లిలో ఓ ఇంటి ప్రహరీ కుప్ప కూలింది. శిథిలాల కింద ఆరుగురు కుటుంబ సభ్యులు చిక్కుకున్నారు. సమాచారం అందుకున్న జీహెచ్ ఎంసీ, పోలీ స్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాల కింద లభించిన రెండు మృతదే హాలను గుర్తించారు. తీవ్రగాయాల పాలైన మరో నలుగురిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అలాగే అఫ్జల్‌సాగర్ మంగల్ బస్తీలో నాలా దాటేందుకు యత్నించిన మామ గల్లంతయ్యాడు. అతడిని కాపాడేందుకు అల్లుడు యత్నించి, అతడు కూడా గల్లంతయ్యాడు. అలాగే ముషీరాబాద్‌లోనూ ఓ యువకుడు వరద కొట్టుకునిపోయి గల్లంతయ్యాడు.

ప్రాంతాలవారీగా వర్షపాతం..

రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్‌లో అత్యధికంగా 12.7 సెం.మీ వర్షపాతం నమోదైంది. బోడుప్పల్ బౌద్ధనగర్ కాలనీలో 12.38 సెం.మీ, ముషీరాబాద్‌లో 12.10 సెం. మీ, జవహర్‌నగర్‌లో 11.40 సెం.మీ, ఉస్మానియా యూనివర్సిటీలో 10.58 సెం.మీ, క్యాప్రాలో 10.28 సెం.మీ, మారేడ్‌పల్లిలో 10.13 సెం.మీ, అడికిమేట్, షేక్‌పేట, ఉప్పల్, హిమాయత్‌నగర్, మలక్‌పేట ప్రాంతాల్లో 8  9.60 సెం.మీ మధ్య వర్షపాతం నమోదైంది. జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయం వద్ద 8.00 సెం.మీ, అల్వాల్, అంబర్‌పేట, నాంపల్లి, చిల్కానగర్, గోల్కొండ, జూబ్లీహిల్స్, బేగంపేట ప్రాంతాల్లో 6.5 సెం.మీ  సెం.మీ మేర వర్షం కురిసింది. పాతబస్తీ, కూకట్‌పల్లి, నిజాంపేట్, ఎల్బీనగర్, పంజాగుట్ట, బంజారాహిల్స్ వంటి ప్రాం తాలు వరదప్రభావానికి గురయ్యాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.

మరో 4 రోజులు భారీ వర్షాలే రాష్ట్రంలో పలు జిల్లాలో వానలు

హైదరాబాద్, సెప్టెంబర్ 14 (విజయక్రాంతి): రాష్ట్రంలో మరో నాలుగు రోజు లు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. సోమవారం ఆదిలాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నారాయణపేట జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. మంగళవారం ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నారాయణపేట జిల్లాలలో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని సూచించింది. శుక్రవారం వరకు కూడా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపింది.  గంటకు 30 కి.మీ. వేగంతో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.