13 April, 2026 | 9:05 PM

సీట్ల వివరాలు వెల్లడించాల్సిందే!

09-05-2024 01:47 AM

నోటీస్ బోర్డులో తప్పక ఉంచాలి

రాత పరీక్షలు నిర్వహించి సీట్లు కేటాయిస్తే చర్యలు 

కళాశాలలను ఆదేశించిన ఇంటర్ బోర్డు

2024 అడ్మిషన్ షెడ్యూల్ విడుదల

నేటి నుంచి ఇంటర్ అడ్మిషన్లు షురూ

హైదరాబాద్, మే 8 (విజయక్రాంతి): రాష్ట్రంలోని ప్రైవేట్, ప్రభుత్వ, గురుకుల కాలేజీల్లో 2024 విద్యా సంవత్సరానికి ఇంటర్మీడియట్‌లో ప్రవేశాలకు సంబంధించిన షెడ్యూల్‌ను ఇంటర్ బోర్డు బుధవారం విడుదల చేసింది. నేటి (గురువారం) నుంచి ఇంటర్ ప్రవేశాలను ప్రారంభించనున్నట్లు పేర్కొంది. జూన్ 1 నుంచి తరగతులను నిర్వహించనున్నట్లు తెలిపింది. మొదటి విడత ప్రవేశాలను జూన్ 30వ తేదీలోపు పూర్తి చేయాలని సూచించింది. దరఖాస్తుల స్వీకరణకు ఈ నెల 31 వరకు గడువిచ్చారు. ఒక్కో సెక్షన్‌లో 88 మంది విద్యార్థులకు మించరాదని కళాశాలలకు బోర్డు ఆదేశించింది. ఇంటర్‌లో ప్రవేశాలు తీసుకోవాలనుకునే విద్యార్థులు మార్క్స్ మెమో, ఆధార్ కార్డు తప్పనిసరిగా దరఖాస్తుకు జతచేయాలని వెల్లడించింది. ప్రొవిజినల్ అడ్మిషన్ పూర్తయిన తర్వాత కచ్చితంగా ఒరిజినల్ మెమోతో పాటు టీసీ సమర్పించాలని స్పష్టం చేసింది. ప్రవేశాల కోసం ఎలాంటి రాత పరీక్ష నిర్వహించకూడదని ఆయా కాలేజీలకు బోర్డు హెచ్చరికలు జారీ చేసింది.

గుర్తింపు ఉన్న కాలేజీల్లోనే అడ్మిషన్లు తీసుకోవాలి...

ఇంటర్ బోర్డు గుర్తింపు ఉన్న కాలేజీల్లోనే విద్యార్థులు అడ్మిషన్లు తీసుకోవాలని సూచించింది. గుర్తింపు పొందిన కాలేజీల జాబితాను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతామని వెల్లడించింది. అదనపు సెక్షన్ల కోసం బోర్డు నుంచి అనుమతి తీసుకోవాలని సూచించింది. కాలేజీలో ఎన్ని సెక్షన్లు ఉన్నాయి.. ఎన్ని సీట్లు ఉన్నాయి.. వాటిలో ఎన్ని భర్తీ అయ్యాయి వంటి వివరాలను రోజూవారీగా కళాశాలల ముందు నోటీస్ బోర్డును ఏర్పాటు చేసి అందులో పొందుపర్చాలని ఆదేశించింది. ప్రతీ సెక్షన్లో ఎన్ని సీట్లు ఖాళీగా ఉన్నాయో స్పష్టంగా తెలియజేయాలని పేర్కొంది.

బాలికలకు 33 శాతం సీట్లు...

పదో తరగతి గ్రేడింగ్ ఆధారంగానే ప్రవేశాలను జరపాలని బోర్డు ఆదేశించింది. ఇక కాలేజీ సీట్లలో ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 10 శాతం, బీసీలకు 29 శాతం (ఏ బీ సీ డీ ఈ శాతం) రిజర్వేషన్ల ప్రకారం సీట్లు కేటాయించాలని తెలిపింది. వికలాంగులకు 5 శాతం, ఎన్‌సీసీ, స్పోర్ట్స్, ఇతర అర్హతలున్న వారికి 5 శాతం, మాజీ సైనికోద్యోగుల పిల్లలకు 3 శాతం, ఆర్థికంగా వెనుకబడిన వారికి 10 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని సూచించింది. అదే విధంగా ప్రతీ కాలేజీలో బాలికలకు 33.33 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని వెల్లడించింది. తండ్రిలేని, జోగిని పిల్లల విషయంలో పేరెంట్స్ కాలమ్‌లో తల్లి పేరును నమోదు చేయాలని కళాశాలలకు ఆదేశాలు జారీ చేసింది.